అస్సాంలోని రంగియా రైల్వే స్టేషన్ సమీపంలోని ఓ హోటల్లో ఓ యువతి దారుణంగా హత్యకు గురైన ఘటన తీవ్ర కలకలం రేపింది. ప్రియురాలిని హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న యువకుడే స్వయంగా పోలీసులకు సమాచారం అందించడంతో ఈ ఘటన మరింత సంచలనంగా మారింది.
అస్సాంలోని సోనిత్పూర్ జిల్లాకు చెందిన మలాని కురియా (23), అభిజిత్ కిండు (22) చెన్నైలోని ఓ ప్రైవేట్ సంస్థలో కలిసి పనిచేస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో ఇద్దరి మధ్య ఏర్పడిన పరిచయం క్రమంగా ప్రేమగా మారినట్లు తెలుస్తోంది.
ఇటీవల మలాని తన ఇద్దరు స్నేహితురాళ్లతో కలిసి చెన్నై నుంచి అస్సాంకు వచ్చింది. వారిని రైల్వే స్టేషన్లో కలిసేందుకు వచ్చిన అభిజిత్.. సమీపంలోని ఓ హోటల్లో రెండు గదులను బుక్ చేసినట్లు సమాచారం. ఒక గదిలో అభిజిత్ ఉండగా, మరో గదిలో మలాని తన స్నేహితురాళ్లతో కలిసి బస చేసింది. అనంతరం రాత్రి సమయంలో మలానిని తన గదికి అభిజిత్ తీసుకెళ్లినట్లు తెలుస్తోంది.
మరుసటి రోజు ఉదయం మలాని స్నేహితురాళ్లు తమ స్వగ్రామానికి వెళ్లేందుకు సిద్ధమవుతూ ఆమెకు ఫోన్ చేశారు. అందుకు మలాని, “మీరు వెళ్లండి.. నేను తర్వాత వస్తాను” అని చెప్పినట్లు సమాచారం. అయితే చాలా సమయం గడిచినా ఆమె రాకపోవడంతో స్నేహితురాళ్లకు అనుమానం వచ్చింది.
ఇదిలా ఉండగా, మలానిని హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అభిజిత్ స్వయంగా పోలీసులకు ఫోన్ చేసి హోటల్ గదిలో జరిగిన ఘటన గురించి సమాచారం అందించినట్లు పోలీసులు తెలిపారు.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే హోటల్కు చేరుకుని గది తలుపు తెరిచి లోపలికి వెళ్లారు. అక్కడ మలాని మృతదేహాన్ని గుర్తించారు. ఆమె శరీరంపై తీవ్ర గాయాలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మృతదేహం సమీపంలో ఓ పెద్ద కత్తెర, స్క్రూడ్రైవర్ కనిపించినట్లు సమాచారం. మలాని వద్ద లభించిన గుర్తింపు కార్డు ఆధారంగా ఆమెను గుర్తించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు.
పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో.. ఇద్దరి మధ్య కొంతకాలంగా సంబంధానికి సంబంధించిన విభేదాలు, మనస్పర్థలు ఉన్నట్లు వెల్లడైనట్లు సమాచారం. ఈ కారణంగానే హత్య జరిగిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
హత్య అనంతరం అభిజిత్ కూడా ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే ఆ ప్రయత్నం విఫలమైన తర్వాత అతడు గదిలోనే ఉన్నట్లు దర్యాప్తులో వెల్లడైనట్లు సమాచారం.
అభిజిత్ తనపై ఉన్న ఆరోపణలను అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం అతడిని అదుపులోకి తీసుకుని ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలపై విచారణ కొనసాగిస్తున్నారు.
హోటల్ గదిలో యువతి దారుణ హత్యకు గురైన ఘటనతో స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది. ఈ ఘటన వెనుక అసలు కారణాలు, హత్యకు దారితీసిన పరిస్థితులు పోలీసుల దర్యాప్తు పూర్తయిన తర్వాత మరింత స్పష్టమయ్యే అవకాశం ఉంది.
