ఫరీదాబాద్‌లో ఒక విచిత్రమైన మరియు ఆందోళనకరమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. దేశంలోనే నంబర్ వన్ బ్యాంక్‌గా పేరున్న ఎస్బీఐ (SBI)లో ఒక చార్టర్డ్ అకౌంటెంట్ (CA)కు చెందిన లాకర్ మాయమైపోయింది. ఆ లాకర్లో సుమారు రెండు కోట్ల రూపాయల విలువైన బంగారం, మూడు కిలోల వెండితో పాటు ఇతర విలువైన వస్తువులు ఉన్నాయి.
అసలేం జరిగిందంటే? సి.ఎ. డి.సి. గర్గ్ అనే వ్యక్తికి ఫరీదాబాద్‌లోని సెక్టార్ 15 బ్రాంచ్‌లో 2014 నుండి ఒక లాకర్ ఉంది. రెండు రోజుల క్రితం ఆయన భార్య ఆ లాకర్‌ను ఓపెన్ చేయడానికి బ్యాంక్‌కు వెళ్లారు. అక్కడ సిబ్బందిని సంప్రదించగా, అసలు ఆ నంబర్ గల లాకర్ వారికి కేటాయించబడి లేదని, అది వేరే వ్యక్తికి ఇచ్చినట్లు చెప్పడంతో ఆమె షాక్‌కు గురయ్యారు. వెంటనే తన భర్తకు ఫోన్ చేసి ఏడుస్తూ విషయం చెప్పారు.
మరో వ్యక్తికి కేటాయింపు? బాధితుడు డి.సి. గర్గ్ బ్యాంక్‌కు చేరుకుని అధికారులను నిలదీయగా.. “మీరు లాకర్‌ను సరెండర్ చేసి ఉంటారు” అని బ్యాంక్ సిబ్బంది సమాధానమిచ్చారు. అయితే, ఒకవేళ లాకర్ సరెండర్ చేస్తే ఒరిజినల్ తాళంచెవి (Key) తన దగ్గరే ఎందుకు ఉంటుందని గర్గ్ ప్రశ్నిస్తున్నారు. పైగా, ప్రతి సంవత్సరం తన ఖాతా నుండి లాకర్ ఫీజు కింద ₹2360 కట్ అవుతున్నట్లు ఆయన ఆధారాలు చూపిస్తున్నారు.
బ్యాంక్ అధికారుల కుమ్మక్కు? బ్యాంక్ అధికారుల సహకారంతోనే తన లాకర్‌ను పగలగొట్టి, అందులోని సవా కేజీ బంగారం, 3 కిలోల వెండిని దొంగిలించారని గర్గ్ ఆరోపిస్తున్నారు. అదే లాకర్‌ను వికాస్ చౌహాన్ అనే మరో వ్యక్తికి డూప్లికేట్ తాళంచెవి ఇచ్చి కేటాయించారని ఆయన ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై బ్యాంక్ హెడ్ క్వార్టర్స్‌కు మరియు పోలీసులకు ఫిర్యాదు అందింది. అసలు లాకర్ ఎప్పుడు పగలగొట్టారు? అందులోని సొమ్ము ఏమైంది? అనే విషయాలపై ప్రస్తుతం విచారణ జరుగుతోంది.
