అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ఉన్న అత్యంత ఎత్తైన భవనాల్లో ఒకటైన ‘స్టెయిన్వే టవర్’ (Steinway Tower) పైకి 18 ఏళ్ల యువతి ప్రమాదకర రీతిలో ఎక్కిన ఘటన తీవ్ర కలకలం రేపింది.
పోర్ట్‌ల్యాండ్‌కు చెందిన వివియన్ వార్నాక్ అనే ఆ యువతి, 1,428 అడుగుల ఎత్తున్న ఈ భవనం బయటి భాగం గుండా పైకి ఎక్కారు. మాన్‌హట్టన్‌లోని ఈ భవనం 91వ అంతస్తు సమీపంలో ఆమె ఎక్కుతున్నట్లు సమాచారం. దీనిని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది భవనం బయటి భాగంలో ఉన్న ఆ యువతిని సురక్షితంగా రక్షించారు. అనంతరం పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. తొలుత ఆమెపై భవనంలోకి అక్రమంగా ప్రవేశించినందుకు తీవ్రమైన సెక్షన్ల కింద కేసు నమోదు చేసినప్పటికీ, ఆ తర్వాత దానిని క్రిమినల్ ట్రెస్పాస్ (అక్రమ ప్రవేశం) కేసుగా మార్చారు. ఈ కేసులో ఆమెను కోర్టులో హాజరుపరచగా, ఆమె ఆ ఆరోపణలను తోసిపుచ్చారు. అనంతరం సొంత పూచీకత్తుపై ఆమెను విడుదల చేసినట్లు సమాచారం.
ఇదిలా ఉండగా, తాను ఇంత ఎత్తైన భవనం ఎందుకు ఎక్కాననే దానిపై వివియన్ ఇచ్చిన వివరణ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. న్యూయార్క్ నగరాన్ని చూడటానికి వచ్చానని, ఆ భవనం పైనుండి నగరంలోని అందమైన దృశ్యాలను ఆస్వాదించడానికే ఎక్కానని ఆమె తెలిపారు. అంతేకాకుండా, తనను పోలీసులు అరెస్ట్ చేయడానికి గల కారణంపై మాట్లాడుతూ.. తాను చాలా ధైర్యవంతురాలినని, స్వతంత్ర భావాలు కలిగిన వ్యక్తినని, దానిని పోలీసులు జీర్ణించుకోలేకపోయారని వింతగా సమాధానమిచ్చారు.
అయితే, ఇంతటి ఎత్తైన భవనాలపైకి అనుమతి లేకుండా ఎక్కడం ప్రాణాలకు ప్రమాదకరం కావడంతో ఆమెపై కేసు నమోదు చేశారు. ఈ ఆరోపణలు రుజువైతే గరిష్టంగా మూడు నెలల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉందని తెలుస్తోంది. సాధారణంగా నగరాన్ని చూడటానికి వచ్చిన యువతి, ఆకాశాన్ని తాకే భవనంపైకి ఎక్కి పోలీసులకు చిక్కిన ఈ ఘటన ప్రస్తుతం ఇంటర్నెట్లో చర్చనీయాంశమైంది.

Leave a Reply