పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రాంతంలో చైనా కంపెనీ నిర్మిస్తున్న తర్బేలా ఆనకట్ట 5వ దశ విస్తరణ ప్రాజెక్టులోని ఒక భాగం అకస్మాత్తుగా కూలిపోయి తీవ్ర ప్రమాదం సంభవించింది.
ఆనకట్టకు సంబంధించిన కనెక్టింగ్ టన్నెల్ (సొరంగం) తవ్వుతున్న సమయంలో బలహీనంగా ఉన్న కొండచరియ కూలిపోవడంతో, ఒక్కసారిగా పోటెత్తిన వరద నీరు సొరంగం, నిర్మాణ ప్రాంతంలోకి చొచ్చుకొచ్చి భారీ వరదను సృష్టించింది.
ఈ ప్రమాదంలో చిక్కుకుని వరద నీటిలో కొట్టుకుపోయిన ఓ కార్మికుడిని సహాయక బృందాలు సురక్షితంగా రక్షించాయి. అయితే, ఆ ప్రాంతంలో వెంటనే ఎమర్జెన్సీ (అత్యవసర పరిస్థితి) ప్రకటించి నిర్మాణ పనులను పూర్తిగా నిలిపివేశారు.
భద్రతా కారణాల దృష్ట్యా ఆనకట్ట నుంచి అదనపు నీటిని కిందకు విడుదల చేయడంతో సింధు నదిలో నీటిమట్టం పెరిగింది. దీంతో ప్రజలు నదిలో స్నానాలకు వెళ్లడం, పడవ ప్రయాణాలు చేయడం లాంటివి చేయరాదని ఆ ప్రాంత జిల్లా కలెక్టర్ హెచ్చరించారు.
ప్రపంచ బ్యాంక్ ఆర్థిక సాయంతో రూ. 317 బిలియన్ల భారీ వ్యయంతో చైనా కంపెనీ నిర్మిస్తున్న ఈ ఆనకట్ట ప్రాజెక్టులో ఇప్పటికే పలుమార్లు ప్రమాదాలు జరిగాయి. ఈ క్రమంలో తాజా ఘటన పాకిస్థాన్ ప్రభుత్వం, చైనా కంపెనీల నాసిరకం పనులపై తీవ్ర విమర్శలకు దారితీసింది.

Leave a Reply