ప్రపంచవ్యాప్తంగా సాంకేతిక అభివృద్ధి, ఆధునిక జీవనశైలిలో కొత్త శిఖరాలను అధిరోహిస్తున్న ప్రస్తుత తరుణంలో.. పొరుగు దేశమైన పాకిస్థాన్ నుంచి మానవత్వాన్ని కలచివేసే ఓ విషాద వార్త వెలుగులోకి వచ్చింది.
సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియో, పాకిస్థాన్లో నెలకొన్న దారుణమైన పేదరికాన్ని, అక్కడి ప్రజల భయంకరమైన ఆకలి బాధలను కళ్లకు కట్టింది. ఈ దృశ్యాలను చూసిన ఎవరికైనా గుండె తరుక్కుపోయేలా అక్కడి పరిస్థితి ఉంది.
వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఓ విలాసవంతమైన ఫంక్షన్ హాల్లో వివాహ విందు ముగిసిన తర్వాత అతిథులంతా భోజనం చేసి వెళ్లిపోయారు. ఆ టేబుళ్లపై మిగిలిపోయిన ఎంగిలి ప్లేట్లు, సగం తిని వదిలేసిన రొట్టెలు, కూరలను చూసిన కొందరు పసిపిల్లలు.. ఆకలి బాధ తాళలేక అక్కడికి పరుగులు తీశారు. ఆత్మాభిమానం, పరిశుభ్రత గురించి ఏమాత్రం పట్టించుకోకుండా, ఆ ప్లేట్లలో మిగిలిపోయిన ఆహారాన్ని వాళ్లు ఆబగా అక్కున చేర్చుకుని తింటున్న దృశ్యం చూసేవారి కంటతడి పెట్టిస్తోంది.
అంతేకాకుండా, ఆకలితో అలమటిస్తున్న తమ కుటుంబ సభ్యుల కడుపు నింపేందుకు.. ఆ మిగిలిపోయిన ఎంగిలి ఆహారాన్ని తమ సంచుల్లో వేసుకుని తీసుకెళ్తున్న ఆ చిన్నారుల దుస్థితి ప్రతి ఒక్కరినీ కదిలిస్తోంది. చేతుల్లో పుస్తకాలు పట్టుకోవాల్సిన వయసులో, ఆకలి దహించివేయడంతో ఎంగిలి భోజనం కవర్లు పట్టుకుని నిల్చున్న ఈ చిన్నారుల దీనస్థితి.. ఆ దేశంలో ఆహార సంక్షోభం ఏ స్థాయిలో విలయతాండవం చేస్తుందో స్పష్టంగా తెలియజేస్తోంది.
ఈ ఘటన ఇంటర్నెట్లో తీవ్రంగా వైరల్ కావడంతో, ప్రపంచవ్యాప్తంగా ఉన్న నెటిజన్లు తమ ఆవేదనను, దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. “ఆకలిని మించిన క్రూరమైనది మరొకటి లేదు” అని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాకిస్థాన్ ప్రభుత్వం ప్రచార ఆర్భాటాలు పక్కనపెట్టి, దేశంలో నెలకొన్న ఈ ఆకలి బాధలను తీర్చడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని సోషల్ మీడియా వేదికగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Leave a Reply