ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీ సత్యసాయి జిల్లా బత్తలపల్లి గ్రామానికి చెందిన సుధాకర్ అనే వ్యక్తి ఆటో డ్రైవర్గా జీవనం సాగిస్తున్నాడు.
భర్తలను వదిలేసి వచ్చిన ఇద్దరు అక్కలు, ఒక చెల్లెలు మరియు 15 ఏళ్ల మేనకోడలితో కలిసి అతను ఒకే ఇంట్లో నివసిస్తున్నాడు. ఇటీవల కాలంలో ఆ కుటుంబ సభ్యులందరూ తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడటమే కాకుండా, విపరీతమైన ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయారు. దీంతో ఆ కుటుంబం మొత్తం కోలుకోలేని తీవ్ర మానసిక క్షోభ, నిరాశ నిస్పృహలకు గురైంది.
తీవ్రమైన పేదరికం, ఆర్థిక ఇబ్బందుల తాళలేక ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్న ఆ ఐదుగురు.. సుధాకర్ ఆటోలోనే నంద్యాల జిల్లాలోని శ్రీశైలానికి చేరుకుని ఒక ప్రైవేట్ లాడ్జిలో గది అద్దెకు తీసుకున్నారు. అక్కడ గది తలుపులు మూసేసి, అందరూ ఒకే గదిలో ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నారు. ఎంతసేపటికీ గది తలుపులు తెరవకపోవడంతో అనుమానం వచ్చిన లాడ్జి సిబ్బంది కిటికీ గుండా చూడగా ఈ ఘోర విషాదం వెలుగులోకి వచ్చింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ఐదుగురి మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు; ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply