అమెరికాలో ఉద్యోగం చేయాలని ఆశపడుతున్నారా? గ్రీన్ కార్డ్ నిబంధనలను కఠినతరం చేస్తున్న అమెరికా.. విదేశీయులకు ఎదురుకానున్న కొత్త చిక్కులు!

అమెరికాలో ఉద్యోగం ద్వారా శాశ్వత నివాసం పొందే గ్రీన్ కార్డ్ ప్రక్రియలో కొత్త ఆంక్షలు విధించేందుకు ఆ దేశ ప్రభుత్వం సిద్ధమవుతోంది.

ఇందుకోసం అమెరికా కార్మిక శాఖ (డిపార్ట్‌మెంట్ ఆఫ్ లేబర్), ఉద్యోగ ఆధారిత గ్రీన్ కార్డ్ జారీ చేసే ‘పెర్మ్’ (PERM) కార్యక్రమంలో కీలక మార్పులను ప్రతిపాదించింది. ఈ మార్పులు అమల్లోకి వస్తే, అమెరికాలో ఉద్యోగాల కోసం వెళ్లాలనుకునే భారతీయులు సహా విదేశీ ఉద్యోగులకు గ్రీన్ కార్డ్ పొందే ప్రక్రియ మరింత క్లిష్టంగా మారవచ్చు.

ప్రస్తుత నిబంధనల ప్రకారం, విదేశీ ఉద్యోగులకు శాశ్వత ఉద్యోగం ఇచ్చే ముందు, ఆ ఉద్యోగానికి అర్హులైన అమెరికన్లు అందుబాటులో లేరని కంపెనీలు నిరూపించాల్సి ఉంటుంది. అయితే కొత్త ప్రతిపాదన ప్రకారం, ఉద్యోగ ప్రకటనలను కనీసం 90 రోజుల పాటు ప్రచురించాల్సి ఉంటుంది. గతంలో కొన్ని సందర్భాల్లో 30 రోజులు మాత్రమే ప్రకటన ఇస్తే సరిపోయేది. అంతేకాకుండా, కంపెనీ వెబ్‌సైట్లు, జాబ్ పోర్టల్స్, సోషల్ మీడియా, జాబ్ ఫెయిర్లు, కళాశాలల ద్వారా కూడా ఉద్యోగ సమాచారాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలి.

అలాగే, గత రెండేళ్లలో నిర్దిష్ట విభాగాల్లో అమెరికన్ ఉద్యోగులను తొలగించిన కంపెనీలు, అదే లేదా దానికి సమానమైన ఉద్యోగాల్లో విదేశీయులను నియమించడానికి గ్రీన్ కార్డ్ సర్టిఫికేషన్ పొందడంలో కొత్త అడ్డంకులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అదనంగా, నర్సులు, ఫిజికల్ థెరపిస్టులు వంటి కొన్ని వృత్తులకు ఇప్పటివరకు ఇస్తున్న ప్రత్యేక మినహాయింపులను కూడా తొలగించాలని ప్రతిపాదించారు. దీనివల్ల విదేశీ ఉద్యోగులను నియమించుకునే సంస్థలకు అదనపు డాక్యుమెంటేషన్, తనిఖీలు తప్పనిసరి అవుతాయి.

ఈ మార్పులన్నీ ప్రస్తుతం ప్రతిపాదనల దశలోనే ఉన్నాయి. ప్రజలు, సంబంధిత సంస్థల అభిప్రాయాలను సేకరించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకోనున్నారు. దీంతో ఇప్పటికే అమెరికాలో పనిచేస్తున్న వారు, అక్కడికి వెళ్లాలని ప్లాన్ చేస్తున్న వారు ఈ ప్రకటనను నిశితంగా గమనిస్తున్నారు. కొత్త నిబంధనలు తుది రూపు దాల్చి అమలైతే, ఉద్యోగం ద్వారా గ్రీన్ కార్డ్ పొందే ప్రక్రియలో గణనీయమైన మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *