ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో పెళ్లైన 9 నెలలకే 30 ఏళ్ల రుచి మిశ్రా అనే మహిళ తన అత్తింట్లో శవమై కనిపించిన ఘటన తీవ్ర దిగ్భ్రాంతిని, విషాదాన్ని నింపింది.
ఈ ఘటన గురించి రుచి భర్తే స్వయంగా ఆమె కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చాడు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న రుచి తల్లి, తన కూతురి మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరైంది. భర్త కుటుంబ సభ్యులపై సంచలన ఆరోపణలు చేసింది.
చనిపోవడానికి ఒకరోజు ముందు రుచి తన తల్లికి ఫోన్ చేసి, “అమ్మా, నన్ను వెంటనే ఈ ఇంట్లో నుంచి తీసుకెళ్లండి. వీళ్లు నన్ను చాలా చిత్రహింసలు పెడుతున్నారు” అని రోదించినట్లు ఆమె తల్లి ఆవేదన వ్యక్తం చేసింది. అంతేకాకుండా, రంగు తక్కువగా (నల్లగా) ఉందనే నెపంతో ఆమె భర్త రోజూ సూటిపోటి మాటలంటూ ఎగతాళి చేసేవాడని, తరచూ కొడుతూ హింసించేవాడని తల్లి ఆరోపించింది.
గత ఫిబ్రవరిలో రుచికి, సీసామౌ ప్రాంతానికి చెందిన గోపాల్ మిశ్రాతో వివాహం జరిగింది. కాగా, రుచి మరణానికి వరకట్న వేధింపులు, అత్తింటి వారి చిత్రహింసలే కారణమని ఆరోపిస్తూ బంధువులు ఆ ఇంటి ముందు ఆందోళనకు దిగి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. దీంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
సమాచారం అందుకున్న పోలీసులు రుచి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల నుంచి అధికారికంగా ఫిర్యాదు అందిన వెంటనే కేసు నమోదు చేసి, పోస్ట్‌మార్టం నివేదిక ఆధారంగా తదుపరి కఠిన చర్యలు తీసుకుంటామని అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఏసీపీ) తెలిపారు.

Leave a Reply