పశ్చిమ బెంగాల్ రాష్ట్రం కోల్కతాలోని బాబు ఘాట్ (Babu Ghat) ప్రాంతంలో ఛత్ పూజ ఏర్పాట్లను రాష్ట్ర క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి డాక్టర్ ఇంద్రనిల్ ఖాన్ ప్రత్యక్షంగా పరిశీలిస్తున్న సమయంలో ఒక ఊహించని, హృదయాలను హత్తుకునే సంఘటన చోటుచేసుకుంది.
గంగా నదిలో వస్తున్న బలమైన ప్రవాహానికి ఓ కుక్క కొట్టుకుపోతూ, నది మధ్యలో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతుండటాన్ని గమనించిన మంత్రి క్షణం కూడా ఆలస్యం చేయకుండా వెంటనే సహాయక చర్యలకు ఉపక్రమించారు. నదిలో తల్లడిల్లుతున్న ఆ మూగజీవిని రక్షించాలని అక్కడ భద్రతా విధుల్లో ఉన్న జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (NDRF), విపత్తు నిర్వహణ బృందాలకు ఆయన తక్షణమే ఆదేశాలు జారీ చేశారు.
మంత్రి ఆదేశాలతో అప్రమత్తమైన రెస్క్యూ బృందాలు వెంటనే మూడు స్పీడ్ మోటార్ బోట్లలో గంగానదిలోకి వెళ్లి ముమ్మరంగా గాలింపు చేపట్టారు. నదిలో చలి, బలమైన ప్రవాహాన్ని సైతం లెక్కచేయకుండా సమర్థవంతంగా పనిచేసిన సహాయక బృందాలు.. ఆ కుక్కను సురక్షితంగా రక్షించి కోల్కతా రివర్ ట్రాఫిక్ పోలీస్ జెట్టీ ప్రాంతానికి తీసుకొచ్చాయి. చల్లటి నది నీటిలో చాలాసేపు పోరాడటం వల్ల ఆ కుక్క తీవ్రమైన చలికి వణుకుతూ, పూర్తిగా నీరసించిపోయి కనిపించింది.
ఒడ్డుకు చేర్చిన ఆ కుక్కను చూసిన మంత్రి ఇంద్రనిల్ ఖాన్ వెంటనే దగ్గరకు వెళ్లి దానికి అవసరమైన ప్రథమ చికిత్సను తన చేతులతోనే అందించారు. అక్కడున్న కుర్చీపై ఉన్న తెల్లటి టవల్ను తీసుకుని వణుకుతున్న కుక్కపై మృదువుగా కప్పి, దానికి వెచ్చదనం కలిగేలా చేశారు. అంతేకాకుండా, వెంటనే ఆ కుక్క కోసం వేడివేడి పాలు తెప్పించి తాగించిన ఆయన, ఆ మూగజీవి పూర్తిగా కోలుకునే వరకు అక్కడే ఉండి చూసుకున్నారు. ఛత్ పూజ లాంటి హడావిడి పండుగ సమయంలోనూ ఒక మూగజీవి ప్రాణం పట్ల మంత్రి చూపించిన ఈ స్వచ్ఛమైన మానవతా దృక్పథం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ పలువురి ప్రశంసలు అందుకుంటోంది.

Leave a Reply