ఉత్తరప్రదేశ్ రాష్ట్రం చిత్రకూట్ జిల్లాలో, పోలీసు శాఖ ప్రతిష్టను దిగజార్చే ఒక దిగ్భ్రాంతికరమైన ఘటన వెలుగులోకి వచ్చింది.
పోలీసు శాఖలో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న ఒక వ్యక్తి, యూనిఫామ్‌తో మద్యం మత్తులో తూలుతూ జాతీయ రహదారి పక్కన ఉన్న హోటల్ కుర్చీలో తలకిందులుగా వేలాడుతూ పడి ఉన్న వీడియో సోషల్ మీడియాలో దావానలంలా వ్యాపిస్తోంది. ఈ ఘటన ఆ రాష్ట్ర పోలీసు విభాగంలో తీవ్ర కలకలం రేపింది.
గత అక్టోబర్ 19న, ప్రయాగ్‌రాజ్ జాతీయ రహదారి సమీపంలోని ఒక హోటల్ వద్దే ఈ ఘటన జరిగింది. పోలీసు యూనిఫామ్‌లో ఉన్న ఆ వ్యక్తి, తల కిందకు వేలాడగా.. కాళ్లు పైకి ఉండేలా అత్యంత విచిత్రమైన, అవమానకరమైన రీతిలో కుర్చీలో పడిపోయి ఉన్నాడు.
దారిలో వెళ్తున్న ప్రయాణికులు దీన్ని చూసి షాకై, వెంటనే ఎమర్జెన్సీ నంబర్‌కు ఫోన్ చేసి సమాచారం అందించారు. ఈ విషయం తెలిసిన వెంటనే పోలీసు ఉన్నతాధికారుల్లో తీవ్ర ప్రకంపనలు చెలరేగాయి.
వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న తోటి పోలీసులు, ఆ హెడ్ కానిస్టేబుల్‌ను రక్షించి తక్షణ వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఇంతలో, ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్లో వైరల్ కావడంతో ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి.
విచారణ తర్వాత పోలీసు శాఖ విడుదల చేసిన ప్రకటనలో, ఆ వ్యక్తి చిత్రకూట్ పోలీస్ లైన్స్‌లో పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుల్ దీపక్ ప్రకాష్ వర్మ అని తేలింది. అంతేకాకుండా, ఆయన ఇలా మద్యం తాగి క్రమశిక్షణ లేకుండా ప్రవర్తించడం ఇది మొదటిసారి కాదని, గతంలో కూడా ఇలాంటి చర్యలకే పాల్పడ్డారని వెల్లడైంది.
దీనిని తీవ్రంగా పరిగణించిన జిల్లా ఎస్పీ అరుణ్ కుమార్ సింగ్ తక్షణ చర్యలు తీసుకుంటూ, ఆ హెడ్ కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా, విచారణ పూర్తయిన తర్వాత ఆయనను ఉద్యోగం నుండి తొలగించే (డిస్మిస్ చేసే) అవకాశాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

Leave a Reply