తమిళనాడులోని ప్రముఖ పర్యాటక, ఆధ్యాత్మిక క్షేత్రమైన రామేశ్వరం పాంబన్ సముద్రపు వంతెన మీదుగా వెళ్తున్న ఎక్స్‌ప్రెస్ రైలు నుంచి ఓ మహిళ అకస్మాత్తుగా దూకేసిన ఘటన తీవ్ర దిగ్భ్రాంతిని, కలకలాన్ని రేపింది.
ఆదివారం ఉదయం తిరువనంతపురం – రామేశ్వరం అమృత ఎక్స్‌ప్రెస్ రైలు కొత్త పాంబన్ రైల్వే వంతెన సముద్ర భాగాన్ని దాటుతున్న సమయంలో, గుర్తుతెలియని ఓ మహిళ రైలు నుంచి కిందకు దూకేసింది. ఆ సమయంలో ఆమె వంతెన రక్షణ గోడను బలంగా ఢీకొనడంతో తలకు, శరీరానికి తీవ్ర గాయాలయ్యాయి.
సమాచారం అందుకున్న రైల్వే పోలీస్ ఇన్‌స్పెక్టర్ కదిర్వేల్ నేతృత్వంలోని పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని, అపస్మారక స్థితిలో పడి ఉన్న ఆ మహిళను రక్షించి ప్రథమ చికిత్స అందించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం రామనాథపురం ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అపస్మారక స్థితిలో చికిత్స పొందుతున్న ఆమె కోలుకున్న తర్వాతే.. ఆమె ఎవరు? ఏ ఊరికి చెందినది? ఎందుకు రైలు నుంచి దూకేసింది? తదితర పూర్తి వివరాలు తెలుస్తాయని పోలీసులు తెలిపారు.
కాగా, కేవలం 24 గంటల వ్యవధిలో ఇదే పాంబన్ సముద్రపు వంతెనపై జరిగిన రెండో విషాద ఘటన ఇది. శనివారం రాత్రి రామేశ్వరం నుంచి మధురై వెళ్తున్న ప్యాసింజర్ రైలు వంతెనను దాటుతున్న సమయంలో, గుర్తుతెలియని ఓ యువకుడు సముద్రంలోకి దూకేశాడు. రైల్వే, కోస్టల్ (తీరప్రాంత) పోలీసులు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టగా.. ఆదివారం ఉదయం పాంబన్ ముల్లిమునై దీవి ప్రాంతంలో ఆ యువకుడి మృతదేహం ఒడ్డుకు కొట్టుకురావడంతో కోస్టల్ పోలీసులు దానిని స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
గత ఏడాది ఏప్రిల్‌లో ప్రారంభమైన కొత్త పాంబన్ రైల్వే వంతెన మీదుగా ప్రతిరోజూ వేలాది మంది ప్రయాణికులు రామేశ్వరానికి వచ్చి వెళుతుంటారు. వంతెనపై రైళ్లు వేగంగా వెళ్తున్నప్పుడు ప్రయాణికులు ప్రమాదకర రీతిలో సెల్ఫీలు దిగడం, ఇప్పుడు వరుసగా ఇద్దరు రైలు నుంచి కిందకు దూకేయడం పర్యాటకులు, రైల్వే అధికారుల్లో తీవ్ర ఆందోళనను పెంచడంతో పాటు భద్రతపై అనేక ప్రశ్నలను లేవనెత్తింది.

Leave a Reply