అడవికి సమీపంలోని గ్రామాల్లోకి చిరుతలు రావడం అప్పుడప్పుడు చూస్తుంటాం. కానీ ఏకంగా ఓ ఇంటి వంటగదిలోకే చిరుతపులి చొరబడితే ఆ కుటుంబ సభ్యుల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. ఉత్తరాఖండ్‌లో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర భయాందోళనలకు కారణమైంది.
ఉత్తరాఖండ్‌లోని తెహ్రీ జిల్లాలో, చంబా పట్టణానికి సమీపంలోని ఓ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఓ కుటుంబం తమ రోజువారీ పనుల్లో నిమగ్నమై ఉండగా, వంటగది వైపు నుంచి వింత శబ్దాలు వినిపించాయి. దీంతో అక్కడికి వెళ్లి చూడగా, వంటగదిలో ఓ చిరుతపులి దాక్కుని ఉండటం కనిపించింది. అది చూసిన కుటుంబ సభ్యులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.
అయితే వెంటనే తేరుకున్న వారు ఏమాత్రం ఆలస్యం చేయకుండా జాగ్రత్తగా ఇంటి నుంచి బయటకు వచ్చారు. అనంతరం తలుపులు మూసి, చుట్టుపక్కల వారిని కూడా అప్రమత్తం చేశారు. ఇంట్లోకి చిరుత చొరబడిందన్న వార్త గ్రామమంతా వ్యాపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.
వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. పరిస్థితి తీవ్రతను గుర్తించిన అధికారులు, రెస్క్యూ సిబ్బందితో కలిసి అవసరమైన పరికరాలతో ఘటనా స్థలానికి చేరుకున్నారు.
చిరుత బయటకు వచ్చి గ్రామస్థులకు ప్రమాదం కలిగించే అవకాశం ఉండటంతో అధికారులు చాలా జాగ్రత్తగా రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. ముందుగా స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించి, ఎవరికీ గాయాలు కాకుండా చిరుతను పట్టుకునేందుకు ప్రయత్నించారు.
చాలాసేపు సాగిన ప్రయత్నాల అనంతరం వంటగదిలో దాక్కున్న చిరుతను సురక్షితంగా బంధించారు. అనంతరం దానిని అటవీ ప్రాంతానికి తరలించి విడిచిపెట్టినట్లు సమాచారం.
ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో గ్రామస్థులు ఊపిరి పీల్చుకున్నారు.

Leave a Reply