ఉత్తరప్రదేశ్ రాష్ట్రం షాజహాన్పూర్లో కుటుంబ కలహాల కారణంగా ఓ వ్యక్తి తన భార్యను వైరుతో గొంతు బిగించి దారుణంగా హత్య చేసిన ఘటన ఆ ప్రాంతంలో తీవ్ర కలకలం రేపింది.
ఆ కిరాతకుడు అదే వైరుతో తన ఇద్దరు కూతుళ్లను కూడా హతమార్చేందుకు ప్రయత్నించాడు.
భార్యను చంపిన తర్వాత, ఆ వ్యక్తి తన 16 ఏళ్ల పెద్ద కుమార్తె కోమల్‌ను చంపేందుకు ఆమె వైపు దూసుకొచ్చాడు. అయితే, ప్రమాదాన్ని పసిగట్టిన ఆ బాలిక వెంటనే ఒక గదిలోకి వెళ్లి లోపల గడియ పెట్టుకుని ప్రాణాలతో బయటపడింది. కానీ, 12 ఏళ్ల చిన్న కుమార్తె అంజలి మాత్రం అతడి చేతికి చిక్కింది.
కన్న తండ్రి అదే వైరుతో చిన్న కూతురి గొంతును కూడా నులమడంతో, ఆ బాలిక తీవ్రంగా గాయపడి స్పృహతప్పి పడిపోయింది. సమాచారం అందుకుని వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న ఆ బాలికను రక్షించి ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించారు. అక్కడ బాలికకు ముమ్మర చికిత్స అందిస్తున్నారు.
ఈ దారుణ ఘటనపై మృతురాలి సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుడైన కమలేశ్‌ను అరెస్టు చేసి విచారిస్తున్నారు. ప్రాథమిక విచారణలో కుటుంబ కలహాలే ఈ దారుణ ఘటనకు ప్రధాన కారణమని తేలింది.

Leave a Reply