దుబాయ్‌లో భార్యకు చెందిన కోట్ల రూపాయల విలువైన బంగారు, వజ్రాభరణాలు, ఖరీదైన వాచీలు, నగదును దొంగిలించిన కేసులో భర్త, అతని కొడుకుపై నేరం రుజువైంది.
ఈ కేసులో ఇద్దరికీ ఇప్పటికే జైలు శిక్ష పడగా, తాజాగా దొంగిలించిన వస్తువుల విలువ, భార్యకు జరిగిన ఆర్థిక, మానసిక నష్టానికి గానూ మొత్తంగా 16.1 మిలియన్ దిర్హామ్‌లు (భారత కరెన్సీలో సుమారు రూ. 40 కోట్లు) చెల్లించాలని దుబాయ్ కోర్టు ఆదేశించింది. కుటుంబంలో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ఖలీజ్ టైమ్స్ (Khaleej Times) ప్రచురించిన కథనం ప్రకారం, భార్యాభర్తల మధ్య దీర్ఘకాలంగా మనస్పర్ధలు, కుటుంబ కలహాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే భర్త తన కొడుకుతో కలిసి ఇంట్లో ఉన్న భార్య ఖరీదైన వస్తువులను దొంగిలించాడని ఆరోపణలు వచ్చాయి. 100కు పైగా బంగారు, వజ్రాభరణాలు, ఖరీదైన వాచీలు, భారీగా నగదు దొంగతనానికి గురయ్యాయని తెలిపారు. వీటి మొత్తం విలువ 15.1 మిలియన్ దిర్హామ్‌లుగా లెక్కగట్టారు. దీంతో భార్య చట్టపరమైన చర్యలు ప్రారంభించింది.
ఈ కేసును విచారించిన క్రిమినల్ కోర్టు, దొంగతనంలో భర్త, కొడుకు ప్రమేయం ఉన్నట్లు నిర్ధారించి ఇద్దరికీ తలా ఏడాది జైలు శిక్ష విధించింది. అంతేకాకుండా, దొంగిలించిన వస్తువుల విలువైన 15.1 మిలియన్ దిర్హామ్‌లను ఇద్దరూ చెల్లించాలని ఆదేశించింది. అయితే, దొంగిలించిన వస్తువుల విలువ మాత్రమే తిరిగి వస్తే తనకు జరిగిన నష్టం భర్తీ కాదని భార్య భావించింది. ఈ ఘటన వల్ల ఆర్థిక నష్టంతో పాటు తీవ్ర మానసిక క్షోభకు గురయ్యానని పేర్కొంటూ, సివిల్ కోర్టులో విడిగా దావా వేసింది. అందులో 50 మిలియన్ దిర్హామ్‌ల పరిహారం కోరింది.
విచారణ సమయంలో, నగలు దొంగిలించబడినప్పటి నుంచి 18 నెలల పాటు వాటిని తాను ఉపయోగించలేకపోయానని, ఆ వ్యవధిలో బంగారం ధర భారీగా పెరగడం వల్ల సుమారు 11 మిలియన్ దిర్హామ్‌ల లాభం కోల్పోయానని భార్య తరఫు న్యాయవాది వాదించారు. అలాగే, భర్త, కొడుకు చేసిన పని వల్ల కలిగిన మానసిక క్షోభకు కూడా పరిహారం కోరారు. అయితే, భవిష్యత్తులో వచ్చే లాభాన్ని వాస్తవ ఆర్థిక నష్టంగా పరిగణించలేమని కోర్టు స్పష్టం చేసింది. అదే సమయంలో, సుదీర్ఘకాలం పాటు తన ఆస్తులను కోల్పోవడం, వాటిని తిరిగి పొందేందుకు న్యాయపోరాటం చేయడం వల్ల కలిగిన నష్టాలను కోర్టు పరిగణనలోకి తీసుకుంది.
చివరగా, దొంగిలించిన వస్తువుల విలువైన 15.1 మిలియన్ దిర్హామ్‌లతో పాటు, ఆర్థిక, మానసిక నష్టాలకు గానూ అదనంగా మరో మిలియన్ (10 లక్షల) దిర్హామ్‌లు చెల్లించాలని కోర్టు ఆదేశించింది. దీంతో భర్త, కొడుకు కలిసి మొత్తంగా 16.1 మిలియన్ దిర్హామ్‌లు (భారత కరెన్సీలో సుమారు రూ. 40 కోట్లు) చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే జైలు శిక్ష అనుభవిస్తున్న వీరిద్దరూ, ఇప్పుడు అదనపు పరిహారం కూడా చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది.

Leave a Reply