ఉత్తరప్రదేశ్‌లోని పండ్లు, కూరగాయల మార్కెట్లలో కొబ్బరికాయలను విక్రయించకూడదని అలహాబాద్ హైకోర్టు ఆదేశించింది.
ఉత్తరప్రదేశ్ వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ చట్టం, 1964 షెడ్యూల్‌లో కొబ్బరికాయను పండ్లు లేదా కూరగాయల విభాగంలో చేర్చలేదని, దానిని నూనె గింజల (ఆయిల్ సీడ్స్) విభాగంలో వర్గీకరించారని కోర్టు స్పష్టం చేసింది. అందువల్ల పండ్లు, కూరగాయల మార్కెట్లలో కొబ్బరికాయలు విక్రయించడానికి అనుమతి లేదని తేల్చిచెప్పింది.
న్యాయమూర్తులు అలోక్ మాథుర్, అమితాబ్ కుమార్ రాయ్‌లతో కూడిన ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది. ఘజియాబాద్‌కు చెందిన ఓ వ్యాపారి, 2003లో సాహిబాబాద్ కూరగాయల మార్కెట్లో లైసెన్స్ పొంది కొబ్బరి బోండాలు, కొబ్బరికాయలు విక్రయిస్తూ వచ్చాడు. అనంతరం మార్కెట్ అధికారులు కూరగాయల మార్కెట్లో కొబ్బరికాయలు అమ్మడానికి అనుమతి లేదని చెప్పి అతడిని అక్కడి నుంచి తొలగించారు. దీనిని సవాలు చేస్తూ ఆ వ్యాపారి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు.
కొబ్బరికాయ ఒక పండు కాబట్టి దానిని విక్రయించడానికి అనుమతించాలని పిటిషనర్ కోరారు. అయితే, ఆ అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది. 1964 చట్టం షెడ్యూల్‌లో వ్యవసాయ ఉత్పత్తుల కింద ఉన్న నూనె గింజల విభాగంలో అవిసె గింజలు, వేరుశెనగ, నువ్వులు, ఆవాలు తదితరాలతో పాటు కొబ్బరికాయను కూడా చేర్చారు. కొబ్బరి నుంచి నూనె తయారు చేయడం, వాణిజ్యపరంగా దానికి ఉన్న వినియోగం ఇందుకు కారణాలుగా పేర్కొన్నారు.
ఈ తీర్పు వల్ల ఉత్తరప్రదేశ్‌లోని 72 పండ్లు, కూరగాయల మార్కెట్లలో కొబ్బరికాయలు విక్రయించే వ్యాపారులపై ప్రభావం పడే అవకాశం ఉంది. రాష్ట్రవ్యాప్తంగా నెలకు 1,000 టన్నులకు పైగా కొబ్బరికాయల విక్రయాలు జరుగుతున్నాయి. ఒక్క సాహిబాబాద్ మార్కెట్లోనే నెలకు సుమారు 250 టన్నుల కొబ్బరికాయలు అమ్ముడవుతున్నట్లు సమాచారం. అంతేకాకుండా, కొబ్బరికాయల విక్రయం కోసం 2020లో తీసుకొచ్చిన రుసుము విధానం కూడా చెల్లదని హైకోర్టు స్పష్టం చేసింది.

Leave a Reply