భోపాల్: మధ్యప్రదేశ్ రాష్ట్రం రాజ్‌గఢ్ జిల్లాలో ఒక తాగుబోతు భర్త తన భార్యను చిత్రహింసలకు గురిచేయడమే కాకుండా, గొలుసులతో ఇంటి స్తంభానికి కట్టేసి, వేడి ఇనుప చువ్వలతో వాతలు పెట్టిన అమానుష ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది.
ఖిల్చిపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సీబీపురా గ్రామానికి చెందిన 30 ఏళ్ల మంగైబాయ్ తన్వర్ భర్త సర్దార్ సింగ్ తన్వర్, గత జూన్ 10వ తేదీన తాగొచ్చి ఎలాంటి కారణం లేకుండా ఆమెను చితకబాదాడు. ఈ అకృత్యాన్ని సహించలేకపోయిన మంగైబాయ్, పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు అర్థరాత్రి అడవి బాటలో కాలినడకన బయలుదేరింది. అయితే, దారిలోనే ఆమెను అడ్డుకున్న భర్త, మళ్ళీ దాడి చేసి బలవంతంగా ఇంటికి లాక్కొచ్చాడు.
స్తంభానికి కట్టేసి 24 గంటల నరకం:
“ఇక పోలీస్ స్టేషన్‌కు వెళ్లి నాపై ఎలా ఫిర్యాదు చేస్తావో చూస్తా” అని సవాల్ విసిరిన ఆ కిరాతకుడు.. భార్య మెడకు ఇనుప గొలుసు వేసి ఇంటి స్తంభానికి కట్టేశాడు. అంతటితో ఆగకుండా గ్యాస్ స్టవ్‌పై ఇనుప చువ్వను ఎర్రగా కాల్చి ఆమె నడుము, తొడ భాగాల్లో వాతలు పెట్టాడు. దాదాపు 24 గంటల పాటు ఆమెను బందీగా ఉంచి చిత్రహింసలు పెట్టాడు.
మెడలో గొలుసుతోనే 6 కిలోమీటర్ల పరుగు:
తర్వాత భార్యను బెదిరించడానికి పంచాయతీని పిలిచే నెపంతో భర్త బయటకు వెళ్లాడు. అదే సమయంలో మంగైబాయ్ సాహసం చేసింది. పక్కనే ఉన్న ఒక పెద్ద బండరాయితో గొలుసు తాళాన్ని పగులగొట్టింది. మెడలో గొలుసు వేలాడుతుండగానే, తీవ్రమైన ఆకలితోనే సుమారు 6 కిలోమీటర్ల దూరం పరుగెత్తుకుంటూ వెళ్లి పోలీస్ స్టేషన్‌కు చేరుకుంది.
రక్తగాయాలతో వచ్చిన ఆమెను చూసి పోలీసులు దిగ్భ్రాంతికి గురయ్యారు. వెంటనే ఆమె మెడలోని గొలుసును తొలగించి వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అనంతరం గ్రామానికి చేరుకున్న పోలీసులు నిందితుడైన సర్దార్ సింగ్‌ను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. ఈ అమానుష ఘటనపై ప్రస్తుతం లోతైన విచారణ జరుపుతున్నారు.

Leave a Reply