బెంగళూరు – మంగళూరు నగరాల మధ్య వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు సేవలను ప్రారంభించేందుకు సన్నాహక ట్రయల్ రన్స్ ప్రస్తుతం ముమ్మరంగా సాగుతున్నాయి.
ఈ ట్రయల్ రన్‌లో భాగంగా పశ్చిమ కనుమల్లోని దట్టమైన అటవీ ప్రాంతాలు, ప్రకృతి అందాలు ఉట్టిపడే కొండకోనల గుండా వందే భారత్ రైలు పరుగులు తీస్తున్న అద్భుతమైన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. వర్షాకాలం కావడంతో పచ్చదనం పరుచుకున్న కొండలు, దట్టమైన పొగమంచు నడుమ తెల్లటి వందే భారత్ రైలు రయ్‌న దూసుకుపోతున్న రమణీయ దృశ్యాలు వీక్షకులను ఎంతగానో కట్టిపడేస్తున్నాయి.
నైరుతి రైల్వే ఆధ్వర్యంలో సకలేశ్‌పూర్ నుంచి సుబ్రహ్మణ్య రోడ్ మధ్య అత్యంత క్లిష్టమైన ఘాట్ సెక్షన్‌లో ఈ ట్రయల్ రన్ విజయవంతంగా నిర్వహించారు. ఈ ట్రయల్స్ పూర్తికాగానే బెంగళూరు – మంగళూరు వందే భారత్ రైలు త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి రానుంది. ఈ సరికొత్త మార్గం ఇరు నగరాల మధ్య ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గించడమే కాకుండా, పశ్చిమ కనుమల అపురూప సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ సాగే ఒక అద్భుతమైన ప్రయాణ అనుభూతిని ప్రయాణికులకు అందించనుంది.

Leave a Reply