జపాన్లో ఎలుగుబంట్లు, మానవుల మధ్య సంఘర్షణలు (Man-Animal Conflict) నానాటికీ పెరుగుతుండటంతో, ఎలుగుబంట్ల సంఖ్యను నియంత్రించే చర్యలను ఆ దేశ ప్రభుత్వం తీవ్రతరం చేసింది.
గత ఏడాది ఒక్క సంవత్సరంలోనే ఎలుగుబంట్ల దాడిలో 230 మందికి పైగా గాయపడగా, 13 మంది ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. ఈ పరిణామాల నేపథ్యంలో, ఏప్రిల్ 2025 నుంచి జనవరి 2026 మధ్య కాలంలోనే ప్రభుత్వం ఏకంగా 14,000కు పైగా ఎలుగుబంట్లను చంపించినట్లు అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇందులో దాదాపు 12,000 ఆసియా నల్ల ఎలుగుబంట్లు (Asian Black Bears), 2,000 బ్రౌన్ ఎలుగుబంట్లు (Brown Bears) ఉన్నాయి. జపాన్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది.
ఎలుగుబంట్లు జనావాసాల్లోకి చొరబడటానికి పలు కారణాలున్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. జపాన్ అడవుల్లో ఎలుగుబంట్లకు ప్రధాన ఆహారమైన ఓక్ (Oak), బీచ్ (Beech) వృక్షాల పండ్లు కొన్ని ప్రాంతాల్లో తీవ్రంగా తగ్గిపోయాయి. వీటికితోడు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వాతావరణ మార్పులు కూడా అడవుల్లో ఆహార కొరతకు దారితీశాయి. మరోవైపు, గ్రామీణ ప్రాంతాల్లో జనాభా తగ్గడంతో అనేక వ్యవసాయ భూములు, తోటలు సంరక్షణ లేక బీడుగా మారుతున్నాయి. అక్కడ లభించే పండ్లు, పంటల అవశేషాలు ఎలుగుబంట్లను మానవ నివాసాల వైపు ఆకర్షిస్తున్నాయని పేర్కొంటున్నారు.
ఇదిలా ఉండగా, ఎలుగుబంట్లను నియంత్రించడంలో మరో కీలక సమస్య ఏమిటంటే.. సుశిక్షితులైన వేటగాళ్ల సంఖ్య తగ్గిపోవడమేనని జపాన్ ప్రభుత్వం తెలిపింది. 1975 నాటితో పోలిస్తే లైసెన్స్ కలిగిన వేటగాళ్ల సంఖ్య సగానికి పైగా తగ్గిపోయింది. దీంతో ప్రజలు నివసించే ప్రాంతాల్లో ఎలుగుబంట్లను వేటాడేందుకు నిబంధనలను ప్రభుత్వం సడలించింది. అయితే వేలాది ఎలుగుబంట్లను హతమార్చినప్పటికీ దాడులు మాత్రం ఆగడం లేదని వార్తలు వస్తున్నాయి. దీంతో ప్రభుత్వ వైఖరిపై వన్యప్రాణి సంరక్షణ నిపుణులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
ఆసియా ఎలుగుబంటి జాతి ఇప్పటికే అంతరించిపోయే ముప్పును ఎదుర్కొంటోంది. జపాన్లో సుమారు 42,000 ఆసియా ఎలుగుబంట్లు ఉన్నట్లు అంచనా వేస్తున్నప్పటికీ, ఈ సంఖ్యపై పూర్తి కచ్చితత్వం లేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ స్థాయిలో విచక్షణారహితంగా వేటాడటం వల్ల కొన్ని ప్రాంతాల్లో ఈ జాతి పూర్తిగా అంతరించిపోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. దీనికి ప్రత్యామ్నాయంగా.. ఎలుగుబంట్లను చంపకుండా జనావాసాల నుంచి తరిమికొట్టే పద్ధతులను కొన్ని ప్రాంతాల్లో అమలు చేస్తున్నారు. ప్రత్యేక శిక్షణ పొందిన కుక్కల ద్వారా ఎలుగుబంట్లను అడవుల్లోకి తరిమివేయడం, అవసరమైన సమయాల్లో మత్తుమందు ఇచ్చి బంధించి సురక్షితంగా అటవీ ప్రాంతాల్లో విడిచిపెట్టడం వంటి చర్యలను అనుసరిస్తున్నారు.

Leave a Reply