మహారాష్ట్రలోని పూణేలో ఐటీ సంస్థలో పనిచేస్తున్న ఒక యువకుడు, తన ప్రియురాలిని దారుణంగా కొట్టి చంపి, రాత్రంతా ఆమె మృతదేహం పక్కనే కూర్చున్న ఘటన తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.
వార్ధాకు చెందిన 27 ఏళ్ల కోమల్ దహాలే విప్రో సంస్థలో, బుల్ధానాకు చెందిన శుభం కల్పాండే ఇన్ఫోసిస్ సంస్థలో పనిచేస్తుండగా, గత మూడేళ్లుగా వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారు. ఇరు కుటుంబాల పెద్దలు కూడా వీరి ప్రేమకు అంగీకారం తెలిపినప్పటికీ, ఇటీవల ఇద్దరి మధ్య తలెత్తిన అనుమానాలతో తరచుగా గొడవలు జరుగుతున్నాయి.
ఈ క్రమంలో, కోమల్ ఉంటున్న గదికి వెళ్లిన శుభంకు, ఆమెకు మధ్య రాత్రంతా తీవ్ర వాగ్వాదం జరిగింది. ఇందులో ఆగ్రహానికి లోనైన శుభం, కోమల్ తలను గోడకు బలంగా కొట్టడమే కాకుండా, మర్మాంగాలపైనా దారుణంగా దాడి చేయడంతో తీవ్ర గాయాలపాలైన కోమల్ అక్కడికక్కడే మృతి చెందింది. ప్రియురాలు చనిపోయిందని గ్రహించి షాక్కు గురైన శుభం, అక్కడి నుంచి పారిపోకుండా తెల్లవార్లూ ఆమె మృతదేహం పక్కనే కూర్చున్నాడు.
తెల్లవారుజామున పోలీసులకు ఫోన్ చేసిన శుభం, తన ప్రియురాలిని తానే హత్య చేసినట్లు సమాచారం ఇచ్చాడు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కోమల్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని ఆసుపత్రికి తరలించడంతో పాటు, శుభంపై కేసు నమోదు చేసి లోతైన దర్యాప్తు చేస్తున్నారు. కూతురిని కోల్పోయిన కోమల్ కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో కన్నీరుమున్నీరుగా విలపించిన దృశ్యం చూపరులను కంటతడి పెట్టించింది. అనుమానం కారణంగానే ఈ దారుణం జరిగినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది.

Leave a Reply