“ఈ సీటు ఖాళీ చేయండి..” కాలు లేని దివ్యాంగ వృద్ధుడితో గొడవ.. కనికరం లేకుండా రన్నింగ్ ట్రైన్ నుంచి తోసేసిన దుర్మార్గుడు.. షాకింగ్ నిజాలు!

ముంబైలో దాదర్ నుంచి బోరివలి వైపు వెళ్తున్న లోకల్ రైలులో దివ్యాంగుల ప్రత్యేక బోగీలో ప్రయాణిస్తున్న కాజెటన్ డెనిస్ ప్రైస్ (64) అనే దివ్యాంగ వృద్ధుడిని కదులుతున్న రైలు నుంచి కిందకు తోసేసి దారుణంగా హతమార్చారు.

దివ్యాంగుల కోసం కేటాయించిన సీట్లో కూర్చున్న అమ్జద్ షఫుద్దీన్ షేక్ (48) అనే వ్యక్తిని.. ఆ సీటు తనదని, ఖాళీ చేయాలని ప్రైస్ కోరారు. దీంతో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో తీవ్ర ఆగ్రహానికి గురైన అమ్జద్ షేక్, ఒక కాలు లేక ఇబ్బంది పడుతున్న ఆ వృద్ధుడిని కనికరం లేకుండా రైలు బయటకు తోసేశాడు.

మాహిమ్ – బాంద్రా స్టేషన్ల మధ్య నడుస్తున్న రైలు నుంచి కిందపడిన ప్రైస్ తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ చికిత్స పొందుతూ ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై రైల్వే పోలీసులు అమ్జద్ షఫుద్దీన్ షేక్‌ను వెంటనే అరెస్ట్ చేసి, భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 103 కింద హత్య కేసు నమోదు చేశారు. పోలీసుల విచారణలో నిందితుడు తప్పించుకునేందుకు కాకిని తోలే క్రమంలో ప్రమాదవశాత్తు చేయి తగిలిందని బుకాయించినప్పటికీ, ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలం ఆధారంగా పోలీసులు సమగ్ర విచారణ జరుపుతున్నారు. దివ్యాంగుల బోగీల్లో సాధారణ ప్రయాణికుల ఆక్రమణలను అరికట్టేందుకు రైల్వే అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని సామాజిక కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *