మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని రేవా జిల్లాలో ఉన్న ఒక ప్రైవేట్ పాఠశాల హాస్టల్‌లో 13 ఏళ్ల బాలుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది.
చోర్హట్టా పోలీస్ స్టేషన్ పరిధిలో కొనసాగుతున్న గురుకుల్ పాఠశాలలో ఈ ఘటన చోటుచేసుకుంది. మృతి చెందిన విద్యార్థి సూర్యాంశ్ గుప్తా ఆ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. గత రెండేళ్లుగా స్కూల్ హాస్టల్‌లోనే ఉంటూ చదువుకుంటున్న అతడు, ఎప్పటిలాగే రాత్రి తన మంచంపై నిద్రపోయాడు.
అయితే మరుసటి రోజు ఉదయం చాలాసేపటి వరకు సూర్యాంశ్ నిద్రలేవలేదు. దీంతో పాఠశాల యాజమాన్యం వెళ్లి చూడగా, మంచంపైనే అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. వెంటనే వైద్యుడిని రప్పించారు. వైద్యుడు పరీక్షించగా, బాలుడు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. దీంతో పాఠశాల యాజమాన్యం, విద్యార్థులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.
ప్రాథమిక పరీక్షలో విద్యార్థికి గుండెపోటు వచ్చి ఉండవచ్చని వైద్యుడు అనుమానం వ్యక్తం చేసినట్లు సమాచారం. అయితే 13 ఏళ్ల బాలుడు మృతి చెందడానికి అసలు కారణం ఇప్పటివరకు నిర్ధారణ కాలేదు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించారు. ఆ నివేదిక అందిన తర్వాతే మరణానికి గల కారణం స్పష్టంగా తెలుస్తుందని భావిస్తున్నారు.
కొడుకు ఆకస్మిక మరణంతో కుటుంబ సభ్యులు తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయారు. అలాగే పాఠశాల యాజమాన్యం తీరుపై తల్లిదండ్రులు ప్రశ్నలు లేవనెత్తారు. రాత్రి నిద్రపోవడానికి వెళ్లినప్పటి నుంచి ఉదయం అపస్మారక స్థితిలో గుర్తించే వరకు జరిగిన ఘటనలపై విచారణ కొనసాగుతోంది. బాలుడి మరణానికి గుండెపోటే కారణమా లేక మరేదైనా ఆరోగ్య సమస్య ఉందా అన్నది పోస్ట్‌మార్టం నివేదిక వెలువడిన తర్వాతే తేలనుంది.

Leave a Reply