కొత్త ఉద్యోగం వచ్చిందన్న సంతోషంతో తొలిరోజే ఎంతో ఉత్సాహంగా పనికి వెళ్లిన ఒక వ్యక్తికి, కేవలం రెండు గంటల్లోనే ఊహించని షాక్ ఎదురైంది.
రెస్టారెంట్లో పనివాడిగా చేరడానికి ముందు జరిగిన ఇంటర్వ్యూలో, ఆ వ్యక్తిని రెస్టారెంట్ యజమాని ఎంతగానో మెచ్చుకున్నాడు. ఈ ఉద్యోగానికి అతనే సరైన వ్యక్తి అని కూడా అన్నాడు. కానీ, తొలిరోజు పనిలో చేరిన రెండు గంటల్లోనే.. అతను చాలా నెమ్మదిగా పని చేస్తున్నాడని చెబుతూ ఉద్యోగం నుంచి తీసేశాడు.
ఈ చేదు అనుభవాన్ని బాధితుడు సోషల్ మీడియాలో పంచుకున్నాడు. కొత్తగా ఉద్యోగంలో చేరిన ఒక వ్యక్తి సామర్థ్యాన్ని కేవలం రెండు గంటల్లోనే ఎలా అంచనా వేయగలరని పలువురు ప్రశ్నిస్తున్నారు. కొందరు ఆ యజమాని తీరును తీవ్రంగా విమర్శించడమే కాకుండా, ఇలాంటి యజమానుల వల్లే ఉద్యోగులకు పని చేయాలనే ఆసక్తి పోతోందని కామెంట్లు పెడుతున్నారు.
ఈ పోస్ట్ చూసిన తర్వాత, మరికొందరు కూడా తమకు ఎదురైన ఇలాంటి చేదు అనుభవాలను పంచుకుంటున్నారు. ఒక వ్యక్తి, తనను ఒక పెద్ద రెస్టారెంట్‌కు ట్రయల్ (పరీక్ష) కోసం పిలిచారని చెప్పాడు. మెనూ (ఫుడ్ లిస్ట్) తెలియదు కాబట్టి కస్టమర్ల దగ్గర ఆర్డర్ తీసుకోవద్దని, టేబుల్స్ దగ్గరకు వెళ్లొద్దని అతనికి చెప్పారు. చెప్పినట్లే సైలెంట్‌గా నిలబడి ఉన్న అతన్ని, కేవలం 45 నిమిషాల్లోనే.. ‘ఐదు నిమిషాలుగా ఖాళీగా నిలబడి ఉన్నావని’ చెబుతూ మేనేజర్ ఇంటికి పంపించేశాడట.
మరొకరు స్పందిస్తూ.. ఆ రెండు గంటల్లో అతడు అంత పెద్ద తప్పు ఏం చేసి ఉంటాడని ప్రశ్నించాడు. ఇంకొకరు స్పందిస్తూ.. కొత్తగా చేరిన వ్యక్తి పనిలో ఏదైనా లోపం ఉంటే వెంటనే తీసేయకుండా, ఏం తప్పు చేస్తున్నాడో వివరించి వేగంగా పని చేసేలా మార్గనిర్దేశం చేసి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. ఈ ఘటన, కొత్తగా ఉద్యోగాల్లో చేరేవారికి తగిన శిక్షణ (ట్రైనింగ్), సమయం ఇవ్వాలా వద్దా అనే చర్చకు సోషల్ మీడియాలో తెరలేపింది.

Leave a Reply