“ఎంతటి పట్టుదల!”.. ఎన్నిసార్లు పట్టుకున్నా అసోంకే పారిపోతున్న ఆడపులి.. అటవీశాఖకే సవాల్ విసురుతున్న ఆశ్చర్యకరమైన ఘటన..!!!

అసోం రాష్ట్రం నుంచి పశ్చిమ బెంగాల్‌లోని బక్సా టైగర్ రిజర్వ్‌కు తీసుకొచ్చిన మూడేళ్ల ఆడపులి, ఇప్పుడు ముచ్చటగా మూడోసారి అక్కడి నుంచి తప్పించుకుపోయింది.

సుమారు 2.2 హెక్టార్ల విస్తీర్ణంలో ఇనుప కంచె ఏర్పాటు చేసిన సురక్షిత ప్రాంతంలో ఈ పులిని బంధించి ఉంచారు.

అయితే, ఈసారి కంచె కింద గుంత తవ్వి ఆ మార్గం గుండా బయటపడింది. ఇప్పటికే రెండుసార్లు ఇదే పులి తప్పించుకుని తన సొంత రాష్ట్రమైన అసోంకు వెళ్లిపోగా, మళ్లీ పట్టుకుని బక్సా అభయారణ్యంలో బంధించారు. ఇప్పుడు మూడోసారి కూడా తప్పించుకోవడం అటవీశాఖ అధికారులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.

గత 34 రోజుల్లో మూడుసార్లు మత్తుమందు ఇచ్చి పట్టుకున్న ఈ పులి, చివరగా పట్టుబడిన నాలుగు రోజులకే మళ్లీ పరారైంది. దాని మెడకు అమర్చిన ప్రత్యేక చిప్ (రేడియో కాలర్) ద్వారా అటవీశాఖ అధికారులు దాని కదలికలను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.

ప్రస్తుతం ఇది బాలా నదిని దాటి బక్సా అటవీ ప్రాంతం గుండా తూర్పు వైపుగా కదులుతున్నట్లు సమాచారం. ఇదే మార్గంలో ప్రయాణిస్తూ పోతే జయంతి, రాయ్డక్ నదులను దాటి పశ్చిమ బెంగాల్ – అసోం సరిహద్దుగా ఉన్న సంకోష్ నదికి చేరుకునే అవకాశం ఉంది. ఆ నదిని కూడా దాటేస్తే అసోంలోని రైమోనా నేషనల్ పార్క్ వైపు వెళ్లవచ్చని జంతుశాస్త్ర నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఒకే పులి వరుసగా మూడుసార్లు భద్రతా వలయాన్ని ఛేదించుకుని తప్పించుకోవడం అటవీశాఖ భద్రతా ఏర్పాట్లపై పలు ప్రశ్నలు లేవనెత్తుతోంది. ముఖ్యంగా ఇనుప కంచె కింది భాగాన్ని సరైన రీతిలో బలోపేతం చేయకపోవడమే పులి తప్పించుకోవడానికి ప్రధాన కారణం కావచ్చని నిపుణులు భావిస్తున్నారు.

సాధారణంగా పులులకు కుక్కల్లా గుంతలు తవ్వే అలవాటు లేకపోయినప్పటికీ, కంచె పునాది బలహీనంగా ఉంటే ఇలా తప్పించుకోవడం సాధ్యమేనని వారు వివరిస్తున్నారు. తన సొంత ఆవాసాన్ని వెతుక్కుంటూ పదే పదే ప్రయాణిస్తున్న ఈ పులి తీరు ప్రస్తుతం వన్యప్రాణి ప్రేమికుల దృష్టిని విశేషంగా ఆకర్షిస్తోంది.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *