“ఎవరైనా ఏమైనా అన్నారా తల్లీ? ఎందుకలా ఉన్నావు.. కాస్త చెప్పు!” పదే పదే అడిగిన తండ్రి.. రెప్పపాటులో నదిలోకి దూకేసిన కూతురు..

జమ్మూ కశ్మీర్‌లోని దోడా జిల్లాలో 21 ఏళ్ల యువతి చీనాబ్ నదిలోకి దూకేసిన విషాద ఘటన తీవ్ర కలకలం రేపింది.

పాయల్ దేవి అనే యువతి ప్రేమ్‌నగర్ సమీపంలోని శివా దాల్ వంతెన పైనుంచి ఆదివారం మధ్యాహ్నం నదిలోకి దూకేసినట్లు సమాచారం అందింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, రాష్ట్ర విపత్తు సహాయక దళాలు (SDRF), స్థానికులు నదిలో ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఆమె ఆచూకీ ఇంకా లభించలేదు.

నదిలోకి దూకడానికి కొద్ది క్షణాల ముందు పాయల్ దేవి వంతెన సమీపంలో ఉన్నప్పుడు, అక్కడ ఉన్న కొందరు ఆమెను ఆపేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. అయితే ఆ వీడియో తాలూకు పూర్తి నేపథ్యం, అంతకుముందు అసలేం జరిగింది అనే వివరాలపై స్పష్టత లేకపోవడంతో పోలీసులు వివిధ కోణాల్లో విచారణ జరుపుతున్నారు.

పాయల్ తండ్రి కృష్ణ లాల్ వివరాలు వెల్లడిస్తూ.. ఘటన జరిగిన రోజు ఆమె స్థానిక జాతరకు వెళ్లిందని, ఆ తర్వాత ఒంట్లో బాగోలేదని, వైద్యుడిని కలవాలని ఫోన్ చేసిందని తెలిపారు. ఆసుపత్రిలో వైద్యుడు లేకపోవడంతో బైక్‌పై ఇంటికి బయలుదేరిందని చెప్పారు. అయితే మార్గమధ్యంలో ఆమె ఉన్నట్టుండి నది వైపు పరిగెత్తుకుంటూ వెళ్లిపోయిందని ఆమెతో ప్రయాణించిన వ్యక్తి ఫోన్ చేసి చెప్పాడని, వెంటనే తాను కూతురికి కాల్ చేసి మాట్లాడానని అన్నారు.

“ఏమైంది తల్లీ? ఎవరైనా ఏమైనా అన్నారా? ఏదైనా సమస్యా?” అని పదే పదే ఆరా తీస్తున్న సమయంలోనే ఆమె ఆఘాయిత్యానికి పాల్పడినట్లు తెలిసింది. ప్రస్తుతం నదిలో పాయల్ కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఆమె ఈ నిర్ణయం తీసుకోవడానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా వెల్లడి కాలేదు; పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *