తెల్లవారుజామున ఇళ్ల తలుపులను బలంగా బాదడంతో, దోపిడీ దొంగలు వచ్చారనుకుని కాలనీవాసులు భయాందోళనకు గురైన ఘటన ఒకటి చోటుచేసుకుంది. పోలీసులు వచ్చి గంటపాటు గాలించిన తర్వాతే, తలుపు తట్టింది దొంగలు కాదని, తలలో రసగుల్లా డబ్బా ఇరుక్కుపోయిన ఒక మేక అని తెలిసి అందరూ నవ్వుకున్నారు.
మహారాష్ట్రలోని బృందావన్ నగర్లో తెల్లవారుజామున 3:30 గంటలకు ఒక ఇంటి తలుపు అకస్మాత్తుగా బలంగా మోగింది. దొంగ వచ్చాడేమోనని భయపడిన ఇంటి యజమాని లైట్లు వేసి కేకలు వేయడం ప్రారంభించగా, ఆ వెంటనే మిగతా ఇళ్ల తలుపులు కూడా బలంగా కొట్టినట్లు శబ్దాలు వచ్చాయి. దీంతో ఆయుధాలతో దోపిడీ ముఠా చొరబడిందని స్థానికులు భయపడిపోయారు.
ఆ ప్రాంతంలోని ఒక ఉపాధ్యాయుడు వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో, పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని సుమారు గంటపాటు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఆ సమయంలో ఒక వాచ్మన్ తలుపు శబ్దం వచ్చిన వైపు పరిశీలించి చూడగా, అక్కడ ఒక మేక ఉండటం కనిపించింది.
ఇంటి బయట ఉంచిన ఖాళీ రసగుల్లా డబ్బాలోని తీపి వాసన కోసం ఆ మేక అందులో తల పెట్టగా, అది లోపల ఇరుక్కుపోయి కళ్లు మూసుకుపోవడంతో ఆ మేక భయంతో పరుగులు తీసింది. దారి కనిపించక అటూ ఇటూ పరుగెత్తే క్రమంలో ఇళ్ల తలుపులను, ఇతర వస్తువులను ఢీకొట్టడంతో ఆ శబ్దాలు విని దొంగలు తలుపులు పగలగొడుతున్నారని ప్రజలు భావించారు.
చివరకు ఆ డబ్బాను కత్తిరించి మేకను సురక్షితంగా బయటకు తీశారు. దోపిడీ ముఠా అనుకుని గంటపాటు వణికిపోయిన ప్రజలు, అసలు నిజం తెలియగానే భయం పోయి పగలబడి నవ్వారు.

Leave a Reply