భారతీయ రైల్వే ముద్ర (Indian Railways Logo) ఉన్న బెడ్‌షీట్లను కొందరు ఒంటిపై దుప్పట్లలా కప్పుకుని బహిరంగంగా రోడ్లపై తిరుగుతున్న వీడియో ఒకటి నెట్టింట ప్రత్యక్షమై తీవ్ర చర్చకు దారితీసింది.
ప్రజా ఆస్తులు ఎలా దుర్వినియోగం అవుతున్నాయో ఎత్తిచూపుతూ ఈ ఘటన పలు ప్రశ్నలను లేవనెత్తుతోంది.
ఇటీవల వెల్లడైన అధికారిక సమాచారం ప్రకారం.. గత కొన్నేళ్ల వ్యవధిలోనే రైళ్ల నుంచి ఏకంగా రూ. 100 కోట్లకు పైగా విలువైన దుప్పట్లు, దిండు కవర్లు, టవళ్లు (తువాళ్లు) మాయమైనట్లు స్పష్టమైంది. ఈ గణాంకాలు రైల్వే ఆస్తుల రక్షణ తీరుపై తీవ్ర ఆందోళనలను పెంచుతున్నాయి.
బహిరంగ ప్రదేశాల్లో చిత్రీకరించిన ఈ వీడియోను చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ప్రభుత్వ ఆస్తులను దొంగిలించి, ఇలా నిర్లజ్జగా వాడుతున్న వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు.
అదే సమయంలో, కేవలం ప్రయాణికులే కాకుండా ఈ వస్తువుల నిర్వహణ బాధ్యతలు చూసే కాంట్రాక్ట్ ఏజెన్సీలను, సిబ్బందిని కూడా క్షుణ్ణంగా తనిఖీ చేయాలని మరికొందరు సూచిస్తున్నారు. రైల్వేకు చెందిన ఇంతటి భారీ సంఖ్యలోని సామగ్రి బయటి మార్కెట్‌కు లేదా సాధారణ వ్యక్తుల చేతుల్లోకి ఎలా చేరుతోందనే దానిపై సమగ్ర విచారణ జరపాలని కోరుతున్నారు.
ప్రభుత్వ ఆస్తులను గుర్తించే విధంగా మరింత స్పష్టమైన గుర్తులు ముద్రించాలని, ప్రభుత్వ సొత్తును కాపాడటంలో ప్రతి పౌరుడికీ కనీస సామాజిక బాధ్యత ఉండాలని సామాజిక కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు.

Leave a Reply