ఏడాది పాటు ప్రేమ.. పెళ్లి సమయానికి మారిపోయిన వరుడి తీరు! దండలు మార్చుకుని, విందు భోజనం చేసిన తర్వాత పెళ్లికి నిరాకరణ.. కారు కట్నంగా అడిగి చివరి నిమిషంలో పారిపోయేందుకు యత్నించాడా?

ఉత్తరాఖండ్‌లోని నైనిటాల్ జిల్లాలో ఓ విచిత్ర ఘటన చోటుచేసుకుంది. పెళ్లి వేడుకలో దండలు మార్చుకుని, విందు భోజనం కూడా చేసిన వరుడు.. చివరి నిమిషంలో పెళ్లి చేసుకోవడానికి నిరాకరించడంతో తీవ్ర గందరగోళం నెలకొంది.

పెళ్లి తంతులో భాగంగా ఏడడుగులు వేసే సమయం రాగానే, తనకు ఈ పెళ్లి వద్దంటూ వరుడు ఒక్కసారిగా వెనక్కి తగ్గాడు. అంతేకాకుండా అక్కడి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. దీంతో ఆగ్రహించిన గ్రామస్థులు అతడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు.

నైనిటాల్ జిల్లాలోని బిందుఖట్టా ప్రాంతానికి చెందిన ఓ గ్రామంలో ఈ ఘటన జరిగింది. అక్కడి యువతికి, కాలాధుంగి ప్రాంతానికి చెందిన ఓ యువకుడితో వివాహం నిశ్చయమైంది. వీరిద్దరూ గత ఏడాది కాలంగా ఫోన్‌లో మాట్లాడుకుంటున్నట్లు సమాచారం.

అనుకున్న ప్రకారం గురువారం వరుడి కుటుంబ సభ్యులు పెళ్లి ఊరేగింపుగా వధువు ఇంటికి చేరుకున్నారు. వధువు కుటుంబ సభ్యులు వారికి ఘన స్వాగతం పలికారు. అనంతరం సంప్రదాయం ప్రకారం వధూవరులు దండలు మార్చుకున్నారు. ఆ తర్వాత వరుడి తరఫు బంధువులు పెళ్లి విందులోనూ పాల్గొన్నారు.

అయితే, పెళ్లి తంతులో కీలకమైన ఏడడుగుల కార్యక్రమం ప్రారంభం కావాల్సిన సమయంలో వరుడు ఒక్కసారిగా పెళ్లికి నిరాకరించాడు. అక్కడి నుంచి వెళ్లిపోయేందుకు ప్రయత్నించాడు. ఇదే సమయంలో వరుడి తరఫు వారు కూడా ఒక్కొక్కరుగా అక్కడి నుంచి వెళ్లిపోవడం ప్రారంభించడంతో వధువు కుటుంబ సభ్యులు, గ్రామస్థులకు అనుమానం వచ్చింది.

దీంతో గ్రామస్థులు వరుడిని అడ్డుకుని పోలీసులకు అప్పగించారు. మరోవైపు, పెళ్లి సంబంధం మాట్లాడుతున్న సమయంలో వరుడు పలుమార్లు కారును కట్నంగా ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు వధువు కుటుంబ సభ్యులు ఫిర్యాదులో ఆరోపించారు. ఆ డిమాండ్ నెరవేరకపోవడంతోనే చివరి నిమిషంలో పెళ్లిని ఆపేశాడని వారు పేర్కొన్నారు.

అంతేకాకుండా, వధువు ఇతర వ్యక్తులతో సంబంధాలు పెట్టుకుంటోందంటూ వరుడు గొడవ చేసినట్లు, తనను బలవంతంగా పెళ్లి చేసేందుకు ప్రయత్నిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని బెదిరించినట్లు కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఆరోపణలపై పోలీసులు వరుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

ఇదిలా ఉండగా, ఉత్తరాఖండ్‌లోని ఉధమ్‌సింగ్ నగర్ జిల్లాలో మరో బాల్యవివాహాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఫుక్సౌరా గ్రామంలో 16 ఏళ్ల బాలికకు వివాహం జరిపించేందుకు ప్రయత్నిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు, ఆ పెళ్లిని నిలిపివేశారు. బాలికను పెళ్లి చేసుకోబోతున్న యువకుడితో పాటు అతడి కుటుంబ సభ్యులపై బాల్యవివాహ నిరోధక చట్టం కింద చర్యలు తీసుకున్నట్లు సమాచారం.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *