ఒకప్పుడు తాగడానికి కూడా నీళ్లు లేక అల్లాడిన గ్రామం. ఇప్పుడు ప్రతిరోజూ 1,000 లీటర్లకు పైగా నీరు.! ఐఐటీ శాస్త్రవేత్తలు చేసిన అద్భుత మార్పు. బీడు భూమిలో పుట్టుకొచ్చిన కొత్త నీటి బుగ్గ.!!

ఉత్తరాఖండ్ రాష్ట్రం తెహ్రీ జిల్లాలోని ఉంజోన్ గ్రామంలో కాలానుగుణంగా వచ్చే తాగునీటి ఎద్దడికి పరిష్కారం చూపేలా, ఐఐటీ రూర్కీ ఒక కొత్త నీటి బుగ్గను సృష్టించింది.

దీని ద్వారా నీటి లభ్యత తక్కువగా ఉండే కాలంలో కూడా, గ్రామంలో ప్రతిరోజూ లభించే తాగునీటి పరిమాణం సుమారు 500 లీటర్ల నుంచి 1,000 లీటర్లు లేదా అంతకంటే ఎక్కువగా పెరిగింది. హిమాలయ ప్రాంతాల్లో నెలకొన్న కాలానుగుణ నీటి కొరతను శాస్త్రీయ పద్ధతిలో ఎలా అధిగమించవచ్చో చెప్పేందుకు ఈ ప్రయత్నం ఒక ఉదాహరణగా నిలిచింది. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖకు చెందిన ‘నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా’ ఆర్థిక సహకారంతో అమలు చేయబడుతున్న, తెహ్రీ జిల్లా తకోలి గాడ్ పరివాహక ప్రాంతంలో ఎండిపోతున్న నీటి బుగ్గలను పునరుద్ధరించే ప్రాజెక్టులో భాగంగా ఈ పనులను చేపట్టారు.

ఐఐటీ రూర్కీకి చెందిన ఎర్త్ సైన్సెస్ (భూవిజ్ఞాన) విభాగం ప్రొఫెసర్ అభయానంద్ సింగ్ మౌర్య నేతృత్వంలో ఈ పరిశోధనలు జరిగాయి. సుమారు 143 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న అలకనంద నదీ పరీవాహక ప్రాంతంలోని నీటి బుగ్గలకు నీరు ఎలా చేరుతోంది, భూగర్భ జలాల స్వభావాన్ని భౌగోళిక నిర్మాణాలు ఎలా ప్రభావితం చేస్తున్నాయనే విషయాలను అధ్యయనం చేశారు. ఈ అధ్యయనం ప్రకారం, నీటి బుగ్గలు తిరిగి నిండటంలో (రీఛార్జ్) దాదాపు 82 శాతం వర్షాకాలం ద్వారానే జరుగుతోంది. శీతాకాలపు వర్షాల ద్వారా 10 శాతం, రుతుపవనాలకు ముందు కురిసే వర్షాల ద్వారా 8 శాతం నీరు చేరుతోంది. అంతేకాకుండా, శిలల స్వభావం, కాలానుగుణ వర్షాలు, మానవ కార్యకలాపాలు భూగర్భ జలాల రసాయన స్వభావాన్ని ప్రభావితం చేస్తున్నాయని పరిశోధనలు తెలిపాయి.

ఈ అధ్యయన ఫలితాల ఆధారంగా, భూగర్భ జలాలను నిల్వ చేయగల శిలా ప్రాంతాలను భౌగోళిక సర్వేల ద్వారా గుర్తించారు. ఆ ప్రాంతం ఎగువ వాలులలో పలు ఇంకుడు గుంతలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ గుంతలు వర్షపు నీరు వేగంగా బయటకు పోకుండా అడ్డుకుని, మట్టిలోకి ఇంకిపోయేలా చేస్తాయి. తద్వారా భూగర్భ జలాలు తిరిగి నిండే అవకాశం పెరుగుతుంది. గుర్తించబడిన పరీవాహక ప్రాంతంలో ఒక నియంత్రిత కాలువ/మార్గం ఏర్పాటు చేసి భూగర్భ జలాలను ఉపరితలానికి తీసుకురావడం ద్వారా ఈ కొత్త నీటి బుగ్గను సృష్టించారు. తెహ్రీ గర్వాల్ జిల్లా కీర్తినగర్ బ్లాక్ పరిధిలోని ఉంజోన్ గ్రామంలో, చంద్రబద్ని ఆలయానికి వెళ్లే కొత్త రోడ్డు పక్కన ఈ నీటి బుగ్గను ఏర్పాటు చేశారు. దీని ద్వారా ముఖ్యంగా వేసవి కాలంలో నీటిపై ఆధారపడే స్థానిక కుటుంబాలకు గొప్ప ఉపశమనం లభించనుందని భావిస్తున్నారు.

హిమాలయ ప్రాంతాల్లోని నీటి బుగ్గలు పర్వత ప్రాంత ప్రజలకు కీలకమైన తాగునీటి వనరులుగా ఉన్నాయి. కానీ, అక్కడి నీటి బుగ్గల్లో దాదాపు 50 శాతం పూర్తిగా ఎండిపోవడం లేదా వాటి నీటి ప్రవాహం తీవ్రంగా తగ్గిపోవడం జరిగిందని చెబుతున్నారు. దీంతో నీటి బుగ్గల ప్రవాహం, నీటి నాణ్యత, కాలానుగుణ మార్పులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం అవసరంగా మారింది. ఈ ప్రాజెక్టు గురించి ఐఐటీ రూర్కీ ప్రొఫెసర్ అభయానంద్ సింగ్ మౌర్య మాట్లాడుతూ.. హిమాలయ ప్రాంతాల్లో నీటి వనరులు, ప్రవాహం, కాలానుగుణ స్వభావాన్ని అర్థం చేసుకోవడం నీటి సమస్య పరిష్కారానికి ఎంతో కీలకమని అన్నారు. ఐఐటీ రూర్కీ డైరెక్టర్ ప్రొఫెసర్ కే.కే. పంత్ మాట్లాడుతూ.. శాస్త్రీయ పరిశోధనలను ప్రజల దైనందిన సమస్యలకు ఆచరణాత్మక పరిష్కారాలుగా మార్చడం చాలా ముఖ్యమని పేర్కొన్నారు. నీటి పరిమాణం, నాణ్యతను పర్యవేక్షించడంతో పాటు స్థానిక ప్రజల భాగస్వామ్యం కూడా ఈ ప్రయత్నం దీర్ఘకాలిక విజయానికి అవసరమని తెలిపారు.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *