ఉత్తరప్రదేశ్లోని బస్తీ జిల్లాలో దారుణ హత్య వెలుగుచూసింది. ఒకే ఇంట్లో ఇద్దరు భార్యలతో కలిసి జీవిస్తున్న ఓ వ్యక్తి కుటుంబంలో చెలరేగిన గొడవ చివరకు హత్యకు దారితీసింది. రెండో భార్య వైద్య చికిత్స ఖర్చుల విషయంలో మొదలైన వివాదం.. ఆమె ప్రాణాలను బలిగొన్నట్లు తెలుస్తోంది.
బస్తీ జిల్లాలోని మిశ్రౌలి గ్రామానికి చెందిన నౌహర్ చౌదరి తొలుత విద్యావతిని వివాహం చేసుకున్నాడు. వీరికి లక్ష్మి అనే కుమార్తె ఉంది. ఆ తర్వాత సునీత అనే మహిళను ఆలయంలో రెండో వివాహం చేసుకుని, ఆమెను కూడా తన ఇంటికి తీసుకొచ్చాడు. ఇద్దరు భార్యలతో కలిసి ఒకే ఇంట్లో కుటుంబాన్ని కొనసాగించాడు.
మొదట్లో ఇద్దరు భార్యలను సమానంగా చూసుకుంటూ సంతోషంగా జీవించాలనుకున్నప్పటికీ.. కొంతకాలానికి కుటుంబంలో విభేదాలు మొదలయ్యాయి. రెండో భార్య సునీత అనారోగ్యానికి గురికావడంతో ఆమె వైద్య చికిత్స కోసం పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు చేయాల్సి వచ్చింది. దీంతో కుటుంబంపై ఆర్థిక భారం పెరిగింది.
సునీత వైద్య ఖర్చులు, ఆమె జీవనశైలి విషయంలో మొదటి భార్య విద్యావతి, కుమార్తె లక్ష్మి అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ కారణంగా ఇంట్లో తరచూ గొడవలు జరుగుతుండేవి. రోజురోజుకూ పెరిగిన ఆర్థిక సమస్యలు, కుటుంబ కలహాలు చివరకు విషాదానికి దారితీశాయి.
ఈ క్రమంలో మొదటి భార్య విద్యావతి.. తన దుపట్టాతో రెండో భార్య సునీత గొంతు బిగించి హత్య చేసినట్లు కథనాలు వెల్లడించాయి. కుటుంబ సభ్యుల సమక్షంలోనే ఈ ఘటన జరిగినట్లు సమాచారం.
సమాచారం అందుకున్న సదర్ కోత్వాలి పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేపట్టి, సునీత హత్యకు సంబంధించి మొదటి భార్య విద్యావతిని అరెస్టు చేసినట్లు కథనం పేర్కొంది.
ఒకే ఇంట్లో ఇద్దరు భార్యలతో కలిసి జీవించాలన్న కోరికతో మొదలైన కుటుంబ జీవితం.. ఆర్థిక సమస్యలు, పరస్పర విభేదాల కారణంగా చివరకు హత్యతో విషాదంగా ముగిసింది.

Leave a Reply