చెన్నై: తమిళనాడు రాజధాని చెన్నైలో పెళ్లయిన ఆరు నెలలకే ఓ నవవధువు బలవన్మరణానికి పాల్పడిన ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. భర్తతో వచ్చిన చిన్నపాటి గొడవ, ఆ తర్వాత అతను ఫోన్ నంబర్ బ్లాక్ చేయడాన్ని తట్టుకోలేక ఓ గర్భిణి ప్రాణాలు తీసుకుంది.
పుట్టింటికి వెళ్లిన భార్య:
చెన్నై వేళచ్చేరికి చెందిన రంజిత (23) అనే యువతికి, గిండి నాగిరెడ్డి తోట ప్రాంతానికి చెందిన కుమారేష్ (26) అనే యువకుడితో ఆరు నెలల క్రితం వివాహమైంది. కుమారేష్ వడపళనిలోని ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఇటీవల ఈ దంపతుల మధ్య చిన్నపాటి కుటుంబ కలహాలు రావడంతో, మనస్పర్థల కారణంగా రంజిత వేళచ్చేరిలోని తన తల్లిగారి ఇంటికి వచ్చేసింది. విడిగా ఉంటున్నప్పటికీ రంజిత తన భర్తతో ఫోన్ ద్వారా నిరంతరం మాట్లాడుతూనే ఉంది.
నెంబర్ బ్లాక్ చేయడంతో మనస్తాపం:
గత గురువారం రంజిత తన భర్తకు పలుమార్లు ఫోన్ చేసింది. అయితే కుమారేష్ ఆమెతో మాట్లాడటానికి నిరాకరించడమే కాకుండా, విసుగుతో రంజిత సెల్‌ఫోన్ నంబర్‌ను ‘బ్లాక్’ (Block) చేశాడు. తాను ఎంతగానో ప్రేమించే భర్త తన నంబర్ బ్లాక్ చేయడంతో రంజిత తీవ్ర మనస్తాపానికి, మానసిక వేదనకు గురైంది. ఆ రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఊరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
పోస్ట్‌మార్టంలో తెలిసిన షాకింగ్ నిజం:
సమాచారం అందుకున్న వేళచ్చేరి పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని రంజిత మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్‌మార్టం నిమిత్తం రాయపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడ జరిగిన శవపరీక్షలో రంజిత గర్భిణి (కడుపుతో) ఉన్నట్లు తేలింది. ఈ విషయం తెలిసి ఇరు కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.
భర్తతో ఏర్పడిన గొడవ, నంబర్ బ్లాక్ చేయడమే రంజిత ఆత్మహత్యకు కారణమా? లేక దీని వెనుక మరేదైనా బలమైన కారణం ఉందా? అనే కోణంలో వేళచ్చేరి పోలీసులు కేసు నమోదు చేసి ముమ్మర దర్యాప్తు జరుపుతున్నారు. పెళ్లయిన 6 నెలలకే యువతి అనుమానాస్పద స్థితిలో ఆత్మహత్య చేసుకోవడంతో నిబంధనల ప్రకారం ఆర్‌డీఓ (RTO) విచారణకు కూడా ఆదేశించారు.

Leave a Reply