“ఒక్క కాఫీ కొనుక్కుని రోజంతా కూర్చుంటే ఎలా?” గంటల కొద్దీ టేబుల్స్ ఆక్రమిస్తున్న కస్టమర్లతో కష్టాలు! కెఫె యజమానులకు వచ్చిపడిన కొత్త తలనొప్పి.!

బెంగళూరులో పెరుగుతున్న ‘వర్క్ ఫ్రమ్ కెఫె’ (Work from Cafe) ట్రెండ్, చిన్న చిన్న రెస్టారెంట్లు, కెఫెల యజమానులకు కొత్త సమస్యను తెచ్చిపెట్టింది.

కెఫెలకు వచ్చే కొందరు కస్టమర్లు కేవలం ఒక్క కప్పు కాఫీ మాత్రమే కొని, గంటల తరబడి ఒకే టేబుల్ దగ్గర కూర్చుని ల్యాప్‌టాప్‌లలో పనిచేసుకుంటున్నారు. దీనివల్ల ఇతర కస్టమర్లకు చోటు దొరకట్లేదని, వ్యాపారం కూడా దెబ్బతింటోందని కెఫె యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి బెంగళూరుకు చెందిన ఓ కెఫె యజమాని అనుభవం ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

బెంగళూరులోని ఇందిరానగర్‌లో ఇటీవల ఒకరు కొత్తగా ఓ కెఫెను ప్రారంభించారు. ఇందుకోసం ఆయన సుమారు రూ. 60 నుంచి రూ. 70 లక్షల వరకు పెట్టుబడి పెట్టినట్లు సమాచారం. ప్రారంభించిన కొద్ది రోజులకే, అక్కడికి వచ్చే కొందరు కస్టమర్లు ఒక్క కాఫీ మాత్రమే ఆర్డర్ చేసి ఎక్కువ సేపు టేబుల్‌ను వాడుకుంటుండటాన్ని ఆయన గమనించారు. తక్కువ ఆర్డర్లతో ఎక్కువ సమయం స్థలాన్ని ఆక్రమించే కస్టమర్ల వల్ల తన ఆదాయం దెబ్బతింటోందని ఆయన వాపోయారు.

ఈ అనుభవాన్ని తన స్కూల్ ఫ్రెండ్ పంచుకున్నాడంటూ విక్రమాదిత్య శుక్లా అనే వ్యక్తి ‘ఎక్స్’ (X) ప్లాట్‌ఫామ్‌లో పోస్ట్ చేశాడు. ఆ పోస్ట్ ప్రస్తుతం ఇంటర్నెట్‌లో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఓ పక్క కెఫెకి వచ్చి పనిచేసుకోవడం కస్టమర్లకు సౌకర్యంగా ఉన్నప్పటికీ, మరోపక్క దుకాణం నడపడానికి అవసరమైన అద్దె, సిబ్బంది జీతాలు, ఇతర ఖర్చులను భరించాల్సిన బాధ్యత యజమానులపై ఉంటుంది. ఒకే టేబుల్ వద్ద గంటల కొద్దీ కూర్చోవడం వల్ల, కొత్తగా వచ్చే కస్టమర్లకు చోటు దొరకని పరిస్థితి ఏర్పడుతోంది.

వర్క్ ఫ్రమ్ హోమ్ (Work from Home) అలవాటు తర్వాత, కెఫెల్లో కూర్చుని పనిచేసుకోవడం కూడా చాలా మందిలో ఎక్కువైంది. ప్రశాంతమైన వాతావరణం, ఇంటర్నెట్ సదుపాయం, ఆహారం, పానీయాలు అందుబాటులో ఉండటం వంటి కారణాలతో యువత కెఫెలను ఎంచుకుంటున్నారు. అయితే, కస్టమర్ల సౌకర్యానికి, కెఫె యజమానుల వ్యాపారానికి మధ్య సమతుల్యత ఉండాల్సిన అవసరం ఉందనే వాదన కూడా వినిపిస్తోంది. ఒక కాఫీ మాత్రమే కొని గంటల తరబడి కూర్చోవడం సరైనదేనా అనే దానిపై ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద చర్చే నడుస్తోంది.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *