వీడియో గేమ్స్ అంటే కేవలం ఆడుకోవడానికి మాత్రమే అనే భావనను ‘గ్రాండ్ థెఫ్ట్ ఆటో’ (GTA) సిరీస్ మార్చేసింది. యూట్యూబ్ విడుదల చేసిన వివరాల ప్రకారం, జీటీఏకు సంబంధించిన వీడియోలు ఇప్పటివరకు 900 బిలియన్లకు పైగా వ్యూస్ సాధించాయి. అంటే 90 వేల కోట్లకు పైగా వీక్షణలు నమోదయ్యాయి. దీని ద్వారా ప్రపంచంలోని అతిపెద్ద ఆన్లైన్ వినోద వేదికల్లో ఒకటిగా జీటీఏ అవతరించింది.
ముఖ్యంగా, ఇంకా విడుదల కాని జీటీఏ 6 (GTA 6) గేమ్‌కు సంబంధించిన వీడియోలే విడుదలకు ముందే 40 బిలియన్ (4,000 కోట్లు) వ్యూస్‌ను దాటాయి. ఈ గేమ్ విడుదలను పురస్కరించుకుని అభిమానులు ట్రైలర్లు, గేమ్‌పై చర్చలు, గేమింగ్ కంటెంట్ క్రియేటర్ల వీడియోలను ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. నవంబర్ 19న జీటీఏ 6 విడుదల కానున్న నేపథ్యంలో, ముందే ఈ స్థాయిలో ఆదరణ లభించడం విశేషం.
ఈ ఆదరణ భారత గేమింగ్ కంటెంట్ క్రియేటర్లకు కూడా కొత్త అవకాశాలను సృష్టించింది. జీటీఏ గేమ్‌ను నేరుగా ఆడటమే కాకుండా, అందులో జరిగే ఆసక్తికర సన్నివేశాలు, పాత్రలు, హాస్యభరిత ఘటనలను వీడియోలుగా రూపొందించి ఆదాయం ఆర్జించే వీలుంది. భారత్‌కు చెందిన పాయల్ ధారే (పాయల్ గేమింగ్) కూడా జీటీఏ 6 విడుదలను పురస్కరించుకుని యూట్యూబ్ నిర్వహిస్తున్న 24 గంటల గ్లోబల్ లైవ్ స్ట్రీమ్ కార్యక్రమంలో పాల్గొననున్నారు.
జీటీఏ 6 తొలి విడుదల ప్లేస్టేషన్ 5 (PS5), ఎక్స్‌బాక్స్ సిరీస్ X|S కన్సోల్స్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుందని ప్రకటించారు. పీసీ (కంప్యూటర్) వెర్షన్ విడుదల తేదీని ఇంకా ప్రకటించలేదు. దీనివల్ల భారత్‌లో గేమింగ్ కన్సోల్స్, కంప్యూటర్ హార్డ్‌వేర్ విక్రయాలకు డిమాండ్ పెరిగే అవకాశం ఉందని ఈ రంగంలోని నిపుణులు భావిస్తున్నారు. కేవలం ఒక గేమ్ విడుదలగానే కాకుండా.. వీడియోలు, లైవ్ స్ట్రీమ్‌లు, ఆన్లైన్ కమ్యూనిటీలు ఇలా పలు వేదికలపై వినోద ప్రపంచాన్నే మార్చే ఘట్టంగా జీటీఏ 6 నిలుస్తోంది.

Leave a Reply