ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్ జిల్లాలో రక్షాబంధన్ పండుగ రోజున భార్యాభర్తల మధ్య చెలరేగిన చిన్నపాటి వాగ్వాదం శ్రుతిమించడంతో, ఆగ్రహించిన భర్త తన ఖరీదైన అపాచీ (Apache) బైక్‌నే తగలబెట్టిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
బిజ్నోర్ జిల్లా జట్పురా ప్రాంతానికి చెందిన బబ్లూ సైనీ అనే వ్యక్తి, రక్షాబంధన్ సందర్భంగా తన భార్యాపిల్లలతో కలిసి అత్తారింటికి బైక్‌పై బయలుదేరాడు. మార్గమధ్యంలో, తన పుట్టింటి వారి కోసం రెండు డబ్బాల మిఠాయిలతో పాటు ఒక పెద్ద కూల్‌డ్రింక్ బాటిల్ కొనివ్వాలని భార్య కోరింది. అయితే బబ్లూ రెండు బాక్సులకు బదులుగా కేవలం ఒక్క స్వీట్ బాక్స్ మాత్రమే కొన్నాడు.
దీంతో అసంతృప్తి చెందిన భార్య నిలదీయడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం మొదలైంది. గ్రామంలోని పంచాయతీ కార్యాలయం సమీపానికి చేరుకునేసరికి ఈ గొడవ మరింత ముదిరింది. ఆగ్రహం కట్టలు తెంచుకోవడంతో బబ్లూ అకస్మాత్తుగా బైక్‌ను రోడ్డు పక్కన ఆపి, దానికి నిప్పు పెట్టేశాడు.
భార్య, పసిపిల్లలు కళ్లముందే చూస్తుండగానే ఆ బైక్ క్షణాల్లోనే భగ్గున మంటల్లో చిక్కుకుంది. కనురెప్పపాటులో బైక్ పూర్తిగా కాలి బూడిదైంది. ఏమాత్రం పట్టించుకోకుండా కాలిపోతున్న బైక్‌ను అక్కడే వదిలేసి బబ్లూ కోపంగా ముందుకు నడుచుకుంటూ వెళ్లిపోయాడు. ఏం చేయాలో పాలుపోక దిగ్భ్రాంతికి గురైన భార్యాపిల్లలు అతని వెనుకే నడుచుకుంటూ వెళ్లారు. ఈ విచిత్ర దృశ్యాన్ని చూసిన బాటసారులు తమ మొబైల్ ఫోన్లలో వీడియో తీశారు. ఈ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్లో విపరీతంగా చక్కర్లు కొడుతోంది.
ఈ ఘటనపై పోలీసుల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ.. భార్యతో వచ్చిన చిన్నపాటి గొడవకే భర్త తన సొంత వాహనాన్ని తగలబెట్టుకున్న ఈ ఉదంతం స్థానికంగా హాట్ టాపిక్‌గా మారింది.

Leave a Reply