బీహార్ రాష్ట్రం మధుబని జిల్లాలో, అర్ధరాత్రి ఓ ఇంట్లోకి అక్రమంగా చొరబడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ పోలీస్ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ (ASI).. తనను నిలదీసిన గ్రామస్తులపై తుపాకీతో కాల్పులు జరపడం తీవ్ర కలకలం రేపింది.
బాబుబార్హి పోలీస్ స్టేషన్ పరిధిలోని బలిరాజ్గఢ్ గ్రామంలో జరిగిన ఈ కాల్పుల్లో 50 ఏళ్ల అశోక్ యాదవ్ ప్రాణాలు కోల్పోయాడు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనలో చంద్రమోహన్ సింగ్ అనే ఏఎస్ఐపై తీవ్రస్థాయిలో ఆరోపణలు వెల్లువెత్తాయి.
నైట్ పెట్రోలింగ్ విధుల్లో ఉన్న ఏఎస్ఐ చంద్రమోహన్ సింగ్.. బలిరాజ్గఢ్ గ్రామంలో నివసిస్తున్న విజయ్ యాదవ్ ఇంట్లోకి అర్ధరాత్రి చొరబడినట్లు తెలుస్తోంది. ఆ సమయంలో విజయ్ యాదవ్ భార్య తన పుట్టింటికి వెళ్లింది. ఇంట్లో ఆమె కూతురు, పొరుగింటికి చెందిన అశోక్ యాదవ్ కూతురు నిద్రిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఏఎస్ఐ చెడు ఉద్దేశంతోనే ఇంట్లోకి వెళ్లినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఇది గమనించిన పొరుగింటి మహిళ ఫూలో దేవి, ఆ ఇంటి బయటి తలుపుకు గడియపెట్టి కేకలు వేసింది. దీంతో చుట్టుపక్కల గ్రామస్తులంతా అక్కడికి చేరుకున్నారు. తన చుట్టూ జనం గుమిగూడటాన్ని చూసిన ఏఎస్ఐ, తన సర్వీస్ రివాల్వర్ తీసి అక్కడున్న వారిపై కాల్పులు జరిపినట్లు ఆరోపణలు వచ్చాయి. సుమారు 5 నుంచి 6 రౌండ్ల పాటు అతను కాల్పులు జరిపాడని చెబుతున్నారు. ఈ ఘటనలో అశోక్ యాదవ్, ధనిక్ లాల్ యాదవ్, ఫూలో దేవి, విజేంద్ర యాదవ్ అనే నలుగురికి బుల్లెట్లు తగిలి తీవ్రంగా గాయపడ్డారు.
గాయపడిన నలుగురినీ వెంటనే బాబుబార్హి కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం మరో ఆసుపత్రికి తరలించగా, అశోక్ యాదవ్ చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. మిగిలిన ముగ్గురికి చికిత్స కొనసాగుతోంది. కాగా, మృతి చెందిన అశోక్ యాదవ్ కూతురికి డిసెంబర్ 14న వివాహం జరగాల్సి ఉందని సమాచారం. పెళ్లి సందడితో ఉండాల్సిన ఆ కుటుంబంలో ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. ఏఎస్ఐ పై వచ్చిన ఆరోపణలపై ఉన్నతాధికారులు, పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply