ఆ భయానక ఉదయం ఏం జరిగిందంటే..
అది 2009 ఏప్రిల్ 25 ఉదయం.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లక్నో జిల్లాలోని గౌరా గ్రామంలో అదొక సాధారణ ఇల్లు. సంతోషి అనే మహిళ వంట కోసం కూరగాయలు కోస్తూ, తన ముగ్గురు చిన్న పిల్లలతో కలిసి ఇంట్లో ఉంది. ఆమె భర్త సర్వన్ ఇంటి ముంగిట కూర్చుని ఉన్నాడు.
వంటకానికి ఉప్పు తీసుకురమ్మని సంతోషి తన భర్త సర్వన్‌ను అడిగింది, కానీ అతను ఆమె మాటలను పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేశాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగి, సంతోషి కోపంతో చేతిలోని బాణలిని (కడాయి) కింద పడేసింది. దాంతో సర్వన్ తీవ్ర ఆగ్రహంతో “నేను వెళ్ళిపోతున్నా” అంటూ ఇల్లు విడిచి బయటకు వెళ్ళాడు.
కానీ, కథ అక్కడితో ముగిసిపోలేదు. కొన్ని నిమిషాల తర్వాత, ఒక మహిళ, ఒక పురుషుడు సంతోషి ఇంట్లోకి చొరబడ్డారు. ఆ మహిళ చేతిలో పదునైన గొడ్డలి పట్టుకుని, “అందరినీ ఖతం చేస్తా” అని అరుస్తూ లోపలికి వచ్చింది. సంతోషి ధైర్యం ప్రదర్శిస్తూ, “ధైర్యముంటే నన్ను చంపు చూద్దాం” అని ఎదురు నిలిచింది.
కన్నపిల్లలను కూడా వదల్లేదు..
ఆ గొడవకు ఇంట్లో పడుకున్న పిల్లలు ఒక్కసారిగా మేల్కొన్నారు. ఆరేళ్ల కుమారుడు రామ్‌రూప్ పరుగెత్తుకుంటూ వచ్చి తన తల్లిని కాపాడుకోవడానికి ప్రయత్నించాడు. కానీ, ఆ రక్కసి బాలుడిని పక్కకు నెట్టేసి సంతోషిపై గొడ్డలితో విచక్షణారహితంగా దాడి చేసింది. సంతోషి పెట్టిన కేకలకు పిల్లలు భయంతో వణికిపోయారు. తీవ్ర గాయాలపాలైన సంతోషి అక్కడికక్కడే కుప్పకూలిపోయింది.
ఆ తర్వాత ఆ హంతకురాలు ఆరేళ్ల రామ్‌రూప్‌ను కూడా వదల్లేదు. వాడిని పట్టుకుని ప్రాణాలు తీసేసింది. అనంతరం నాలుగేళ్ల కూతురు సుమిరన్ కూడా ఆ కిరాతకానికి బలైపోయింది. చివరికి, సంతోషికి ఉన్న ఏడాదిన్నర పసికందు రవి కూడా ఈ ఘోర కాండకు బలయ్యాడు.
అడ్డుకోబోయిన పొరుగువారిపై దాడి
ఇంట్లో నుండి వస్తున్న భయానక కేకలు విన్న పొరుగున ఉండే మాధురి అనే మహిళ సాయం చేయడానికి పరుగెత్తుకుంటూ వచ్చింది. కానీ ఆ హంతకురాలు ఆమెను కూడా వదల్లేదు. మాధురిపై దాడి చేసి ప్రాణాలు తీసింది. అది చూసి భయపడి పారిపోవడానికి ప్రయత్నించిన మాధురి చిన్న బిడ్డపై కూడా దాడికి తెగబడింది. ఈ దారుణ సామూహిక హత్యలతో గ్రామమంతా ఒక్కసారిగా భయాందోళనలు వ్యక్తమయ్యాయి.
పోలీసుల రంగప్రవేశం.. కేసులో ఊహించని మలుపు
మాధురి కుమార్తె సంగీత హుటాహుటిన పోలీస్ స్టేషన్‌కు చేరుకుని జరిగిన ఘోరాన్ని వివరించడంతో పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ రక్తపు మడుగులో నాలుగు మృతదేహాలు, తీవ్రంగా గాయపడిన ఒక చిన్నారి కనిపించారు. పోలీసులు వెంటనే అనుమానితుడైన భర్త సర్వన్‌ను అరెస్టు చేశారు. అయితే, ప్రాథమికంగా చూసినదానికంటే ఈ కేసు వెనుక పెద్ద మిస్టరీ దాగి ఉందని పోలీసుల విచారణలో తేలింది.
హత్య వెనుక దాగిన అసలు రహస్యం:
పోలీసులు లోతుగా దర్యాప్తు జరపగా, సర్వన్‌కు తన సొంత వదిన (అన్న భార్య) సుమన్‌తో ఉన్న అక్రమ సంబంధమే ఈ ఘోరానికి కారణమని తేలింది. భార్య సంతోషి వీరి బంధాన్ని తీవ్రంగా వ్యతిరేకించడంతో, ఆమెను పిల్లలతో సహా వదిలించుకోవాలని సర్వన్, సుమన్ కలిసి ఈ స్కెచ్ వేశారు. నాడు ఇంటికి గొడ్డలితో వచ్చి దారుణానికి ఒడిగట్టిన ఆ మహిళ మరెవరో కాదు, సర్వన్ ప్రియురాలు సుమనే.
కోర్టు సంచలన తీర్పు:
సుదీర్ఘ విచారణ అనంతరం, దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత కోర్టు ఈ కేసులో సంచలన తీర్పునిచ్చింది. ఈ ఘోరానికి సూత్రధారి అయిన భర్త సర్వన్‌కు కోర్టు ఉరిశిక్ష ఖరారు చేయగా, హత్యకు ప్రత్యక్షంగా సహకరించిన వదిన సుమన్‌కు జైలు శిక్ష విధిస్తూ న్యాయస్థానం తీర్పునిచ్చింది.

Leave a Reply