లైంగిక నేరాలకు సంబంధించి తరచుగా ఫిర్యాదులు చేసే వారి వివరాలతో ప్రత్యేక డేటాబేస్‌ను రూపొందించాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్) సుప్రీంకోర్టు కొట్టివేసింది. ప్రతి పౌరుడికి ఫిర్యాదు చేసే హక్కు ఉందని, ఒక వ్యక్తి 100 సార్లయినా ఫిర్యాదు చేయవచ్చని న్యాయస్థానం స్పష్టం చేసింది. అయితే, ఆ ఫిర్యాదులు తప్పుడువని రుజువైతే చట్టప్రకారం అందుకు తగిన పరిణామాలను సంబంధిత వ్యక్తులు ఎదుర్కోవాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు హెచ్చరించింది.
జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చి, జస్టిస్ వి. మోహనలతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఈ కేసును విచారించి తీర్పు వెలువరించింది. షోనీ కపూర్ అనే వ్యక్తి కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ ప్రభుత్వం, ఢిల్లీ పోలీస్ కమిషనర్‌కు వ్యతిరేకంగా ఈ పిటిషన్ దాఖలు చేశారు. ప్రతి జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో తరచుగా ఫిర్యాదులు చేసే వారి రికార్డులతో ఒక క్రమబద్ధమైన డేటాబేస్‌ను ఏర్పాటు చేయాలని అందులో కోరారు. ఈ డేటాబేస్‌లో నిందితుల వివరాలు కాకుండా, ఫిర్యాదుదారుల వివరాలే ఉండాలని పిటిషనర్ తరఫున వాదించారు.
పిటిషన్‌ను విచారించిన జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చి, లైంగిక నేరాల దర్యాప్తు కోసం ఇప్పటికే వైద్య పరీక్షలు, డీఎన్ఏ (DNA) పరీక్షలు, మెజిస్ట్రేట్ ఎదుట వాంగ్మూలం నమోదు చేయడం వంటి చట్టబద్ధమైన విధానాలు అమలులో ఉన్నాయని గుర్తుచేశారు. అంతేకాకుండా, ఫిర్యాదుదారుల డేటాబేస్‌ను రూపొందిస్తే లైంగిక నేరాల బాధితుల గుర్తింపు బహిర్గతమయ్యే ప్రమాదం ఉందని, వ్యక్తిగత గోప్యతను కాపాడేందుకు చట్టంలో ఇప్పటికే అనేక రక్షణ చర్యలు ఉన్నాయని కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది.
కొందరు వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారన్న వాదనను అంగీకరించేందుకు నిరాకరించిన సుప్రీంకోర్టు, తప్పుడు ఫిర్యాదులపై చర్యలు తీసుకునేందుకు చట్టంలో ఇప్పటికే తగిన నిబంధనలు ఉన్నాయని పేర్కొంది. ప్రస్తుత దర్యాప్తు విధానాలు, బాధితుల గోప్యతకు కలిగే ముప్పును దృష్టిలో ఉంచుకుని, ఫిర్యాదుదారుల డేటాబేస్ ఏర్పాటు చేయాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు ధర్మాసనం పూర్తిగా తిరస్కరించి, పిటిషన్‌ను కొట్టివేసింది.

Leave a Reply