ఉత్తరప్రదేశ్లోని బస్తీ జిల్లాలో ప్రేమ వ్యవహారాన్ని వ్యతిరేకించినందుకు, కన్న కుమార్తె తన ప్రియుడితో కలిసి తండ్రినే దారుణంగా హత్య చేసిన విషాదకర సంఘటన చోటుచేసుకుంది.
ఛావని (Chhavani) పోలీస్ స్టేషన్ పరిధిలోని రమ్వాపూర్ గ్రామానికి చెందిన కృష్ణ (52) అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. ఆయన 17 ఏళ్ల మైనర్ కుమార్తెకు, పక్క గ్రామానికి చెందిన లక్ష్మణ్ అనే యువకుడికి మధ్య గత రెండేళ్లుగా ప్రేమ వ్యవహారం నడుస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రేమను కృష్ణ మొదటి నుంచీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ వచ్చాడు.
ఈ క్రమంలో, ఆగస్టు 21న కృష్ణ మేకలను మేపేందుకు వెళ్లిన సమయంలో, చెరకు తోట సమీపంలో తన కుమార్తె, లక్ష్మణ్ ఏకాంతంగా ఉండటాన్ని ప్రత్యక్షంగా చూశాడు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన కృష్ణ వారిద్దరినీ మందలించగా, వారి మధ్య తీవ్ర వాగ్వాదం చెలరేగింది. గొడవ ముదరడంతో వారిద్దరూ కలిసి కృష్ణపై దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఆయన ఘటనా స్థలంలోనే మృతి చెందినట్లు పోలీసుల విచారణలో తేలింది.
అనంతరం, కృష్ణ మృతదేహాన్ని ఒక గుడ్డలో కట్టి పక్కనే ఉన్న కాలువలో పడేశారు. ఎంత సమయమైనా కృష్ణ ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆయన బంధువు అజయ్ గాలింపు చర్యలు చేపట్టాడు. ఎంత వెతికినా ఆచూకీ లభించకపోవడంతో అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టగా అసలు నిజం వెలుగులోకి వచ్చింది. దీంతో పోలీసులు నిందితురాలైన కుమార్తె, ఆమె ప్రియుడిని అరెస్ట్ చేసి, కాలువలోంచి మృతదేహాన్ని వెలికితీసి పోస్ట్మార్టం నిమిత్తం తరలించారు.
పోలీసుల ప్రాథమిక విచారణలో, కృష్ణ గతంలోనూ వీరి ప్రేమను తీవ్రంగా వ్యతిరేకించినట్లు తెలిసింది. రెండు నెలల క్రితం వీరిద్దరినీ చూసినప్పుడు సర్దిచెప్పి పెళ్లి చేయడానికి ప్రయత్నించినప్పటికీ, కూతురు మైనర్ కావడంతో ఆ పెళ్లి జరగలేదని పోలీసులు తెలిపారు. కన్న తండ్రి అని కూడా చూడకుండా ప్రియుడితో కలిసి ప్రాణాలు తీసిన ఈ దారుణం స్థానికంగా తీవ్ర సంచలనం రేపింది.

Leave a Reply