హర్యానా రాష్ట్రం గురుగ్రామ్‌లోని ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వేపై, కదులుతున్న కారులోంచి టపాసులు, రాకెట్లు పేల్చిన యువకుల వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతోంది.
అతివేగంగా వెళ్తున్న హ్యుందాయ్ కారులోని ఒక వ్యక్తి, కారు కిటికీలోంచి చెయ్యి బయటపెట్టి రాకెట్లను పేల్చాడు. ఈ ప్రమాదకరమైన చర్య రోడ్డుపై వెళ్తున్న ఇతర వాహనదారుల్లో భయాందోళనలు రేకెత్తించింది. పబ్లిక్ రోడ్డుపై ఇతరుల భద్రతను ఏమాత్రం పట్టించుకోకుండా యువకులు ఇలా ప్రవర్తించడం తీవ్ర విమర్శలకు దారితీసింది.
సోషల్ మీడియాలో వ్యాపిస్తున్న వీడియోలో, నల్లటి ఫిల్మ్ అంటించిన అద్దాలు ఉన్న హ్యుందాయ్ కారు ఎక్స్‌ప్రెస్‌వేపై వేగంగా వెళ్లడం కనిపిస్తోంది. కారు నడుపుతున్న యువకుడు ఒక చేత్తో స్టీరింగ్ పట్టుకుని, మరో చేత్తో కిటికీలోంచి టపాసులు పేల్చే తుపాకీ లాంటి పరికరాన్ని బయటకు పెట్టాడు. దాని ద్వారా ఆకాశం వైపు వరుసగా రాకెట్లను పేల్చాడు. కదులుతున్న కారులో ఇలా టపాసులు పేల్చడం వల్ల కారు అదుపు తప్పి ప్రమాదం జరిగే ముప్పును కొనితెచ్చుకున్నట్లయింది.
ఈ ఘటనలో మరింత షాకింగ్ విషయం ఏమిటంటే, వెనుక వస్తున్న మరో కారులోని వ్యక్తి ఈ ప్రమాదకరమైన చర్యను వీడియోగా రికార్డ్ చేయడం. అతను కారు సన్‌రూఫ్ (sunroof) గుండా సగం శరీరాన్ని బయటకు పెట్టి ఈ దృశ్యాలను చిత్రీకరించాడు. ఈ వీడియోను ఆ యువకులే స్వయంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసినట్లు సమాచారం. పేల్చిన రాకెట్లు ఇతర వాహనాలపై పడి ఉంటే పెద్ద ప్రమాదమే జరిగి ఉండేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు.
వీడియో వైరల్ కావడంతో పోలీసులు విచారణ ప్రారంభించారు. కారు రిజిస్ట్రేషన్ నంబర్, అందులో ప్రయాణించిన యువకుల వివరాలను గుర్తించే పనిలో పడ్డారు. నిందితులను గుర్తించిన తర్వాత, ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన, నిర్లక్ష్యపు డ్రైవింగ్ తదితర అభియోగాల కింద కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. అదృష్టవశాత్తూ ఈ ఘటనకు సంబంధించి ఎలాంటి ప్రమాదం నమోదు కాలేదు. అయినప్పటికీ, కొన్ని సెకన్ల వీడియో కోసం ఇతరుల ప్రాణాలను పణంగా పెట్టే ఇలాంటి చర్యల పట్ల ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply