బీహార్లోని తూర్పు చంపారణ్ ప్రాంతంలో, భర్తను తమ దారిలోకి తెచ్చుకోవడానికి ఇద్దరు భార్యలు ఒక మంత్రగాడిని ఆశ్రయించిన వ్యవహారం, చివరకు దారుణ హత్యకు దారితీయడం స్థానికంగా కలకలం రేపింది.
ఈ ప్రాంతానికి చెందిన తబేశ్వర్ సాహ్నికి ఇప్పటికే శారదా దేవి అనే భార్య ఉండగా, ఆమెకు తెలియకుండా నేపాల్ వెళ్లి లక్ష్మీ దేవి అనే మహిళను రెండో వివాహం చేసుకున్నాడు. దీనితో ఆగ్రహించిన మొదటి భార్య శారదా దేవి, తన భర్తను, అతని రెండో భార్యను విడదీయాలని కోరుతూ సికిందర్ సాహ్ని అనే మంత్రగాడిని ఆశ్రయించింది.
దీనికోసం రూ. 50,000 ఇస్తానని ఒప్పందం కుదుర్చుకుంది. అయితే, ఈ ప్లాన్ గురించి తెలుసుకున్న భర్త మరియు రెండో భార్య, అదే మంత్రగాడిని రహస్యంగా సంప్రదించారు. మొదటి భార్య ఇచ్చిన దానికంటే కేవలం వెయ్యి రూపాయలు అదనంగా, అంటే రూ. 51,000 ఇస్తామని ఆశ చూపి, శారదా దేవిని అంతం చేయమని మంత్రగాడిని కోరారు.
డబ్బుకు ఆశపడిన ఆ మంత్రగాడు, శారదా దేవిని బయటకు తీసుకెళ్లి, భర్త మరియు రెండో భార్యతో కలిసి ఆమెను దారుణంగా హత్య చేశాడు. ఇది ప్రమాదవశాత్తు జరిగిన మరణంగా చిత్రీకరించాలని వారు ప్రయత్నించినప్పటికీ, పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి దర్యాప్తు చేయడంతో వారి కుట్ర బయటపడింది. ప్రస్తుతం మంత్రగాడు సికిందర్ సాహ్నిని, రెండో భార్య లక్ష్మీ దేవిని పోలీసులు అరెస్టు చేశారు. పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు, భర్త తబేశ్వర్ సాహ్ని కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

Leave a Reply