అహ్మదాబాద్‌లోని పాల్డీ ప్రాంతంలో 79 ఏళ్ల వృద్ధురాలు తన కోడలిపై దిగ్భ్రాంతి కలిగించే ఫిర్యాదు చేసింది.
కుమారుడు అభిషేక్ 2024లో మరణించిన తర్వాత, వృద్ధురాలు జయశ్రీబెన్ తన కోడలు అంకిత, మనవరాలితో కలిసి నివసిస్తోంది. ఈ క్రమంలో కోడలు తనకు నిరంతరం మత్తుమాత్రలు ఇచ్చి, బ్యాంకు ఖాతా నుంచి రూ.1.84 కోట్లకు పైగా నగదును తన ఖాతాలోకి బదిలీ చేసుకుందని ఆ వృద్ధురాలు ఆరోపించింది.
వృద్ధురాలు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. కుమారుడు మరణించిన తర్వాత కుటుంబ ఖర్చుల కోసమంటూ కోడలు అంకిత ఆమె వద్ద ఖాళీ చెక్కులపై సంతకాలు తీసుకుంది. అంతేకాకుండా, హెచ్డీఎఫ్సీ (HDFC) బ్యాంకులో ఉన్న జాయింట్ అకౌంట్లో తన పేరును కూడా చేర్చుకుందని ఫిర్యాదులో పేర్కొంది. ఇదిలా ఉండగా, వైద్యుడి ప్రిస్క్రిప్షన్‌లో మార్పులు చేసి మత్తుమాత్రలు తెప్పించి వృద్ధురాలికి ఇచ్చినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి.
ఈ మాత్రలను నిరంతరం వేసుకోవడం వల్ల వృద్ధురాలికి తరచూ నిద్రమత్తు, తలతిరగడం వంటి సమస్యలు తలెత్తాయి. ఆరోగ్యం క్షీణించడంతో పలుమార్లు ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. గత 2025 సెప్టెంబర్‌లో ఆమె ఆరోగ్యం మరింత విషమించి, కన్న కూతురినే గుర్తుపట్టలేని స్థితికి చేరుకుంది. దీంతో అనుమానం వచ్చిన కుమార్తె గోషా, తల్లిని ఆసుపత్రికి తీసుకెళ్లింది. అక్కడ నిర్వహించిన రక్త పరీక్షల్లో ఆమె శరీరంలో మత్తుమందు ఆనవాళ్లు ఉన్నట్లు తేలింది.
అనంతరం కుమార్తె, అల్లుడు కలిసి వృద్ధురాలి బ్యాంకు ఖాతాలను పరిశీలించగా.. ఖాళీ చెక్కులు, ఆన్లైన్ లావాదేవీల ద్వారా మొత్తం రూ.1,84,70,000 కోడలి ఖాతాలోకి మరియు మ్యూచువల్ ఫండ్ పెట్టుబడుల్లోకి బదిలీ అయినట్లు గుర్తించారు. అంతేకాకుండా, మరణించిన కుమారుడి మొబైల్ ఫోన్‌ను ఉపయోగించి కూడా నగదు బదిలీలు జరిపినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై పాల్డీ పోలీస్ స్టేషన్లో కోడలు అంకితపై కేసు నమోదు కాగా, పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply