గదిని ముందే బుక్ చేసుకున్నా ఎదురైన షాక్.! న్యూ ఇయర్ పార్టీకి రూ.8,599 వరకు తప్పనిసరి రుసుము. డబ్బులు చెల్లించకపోతే రూమ్ బుకింగ్ క్యాన్సిల్.! హోటల్ షరతుతో చెలరేగిన వివాదం.!!

కొత్త సంవత్సరాన్ని కుటుంబంతో జరుపుకోవడానికి చాలా మంది ముందుగానే పర్యాటక ప్రాంతాల్లోని హోటళ్లు, రిసార్ట్‌లలో గదులను బుక్ చేసుకోవడం ఆనవాయితీ.

కానీ, ముందే బుక్ చేసి డబ్బు చెల్లించిన తర్వాత కూడా, డిసెంబర్ 31న బస చేయడానికి వేలల్లో అదనపు రుసుము చెల్లించాలని హోటల్ యాజమాన్యం చెబితే ఎలా ఉంటుంది? కేరళ రాష్ట్రం మున్నార్‌లోని ఓ ఫైవ్ స్టార్ హోటల్ పెట్టిన షరతు ఇప్పుడు ఒక కస్టమర్‌ను తీవ్ర అసంతృప్తికి గురిచేసింది.

గోవాకు చెందిన టెక్ ఉద్యోగి వేదాంత్ జీ, కుటుంబంతో కలిసి కొత్త సంవత్సరాన్ని జరుపుకునేందుకు మున్నార్‌లోని వైబ్ మున్నార్ రిసార్ట్ అండ్ స్పాలో ముందుగానే గదిని బుక్ చేసుకున్నాడు. ఆ బుకింగ్ ‘నాన్-రిఫండబుల్’ (డబ్బు తిరిగి రాని) కోవకు చెందినది. ఈ నేపథ్యంలో, డిసెంబర్ 31న హోటల్‌లో బస చేసే అతిథులంతా తప్పనిసరిగా న్యూ ఇయర్ ప్రత్యేక విందు (గాలా డిన్నర్) లో పాల్గొనాలని, ఇందుకు విడిగా డబ్బు చెల్లించాలని అతనికి ఈమెయిల్ వచ్చింది.

ఆ ప్రత్యేక విందు కోసం ఛార్జీలు వ్యక్తులను బట్టి మారుతాయి. మద్యం సేవించని పెద్దలకు రూ.4,599, 6 నుంచి 12 ఏళ్ల పిల్లలకు రూ.2,299 గా ఛార్జీ నిర్ణయించారు. మద్యంతో కూడిన విందులో ఐఎంఎఫ్ఎల్ (IMFL) కేటగిరీ కింద రూ.6,599, అలాగే ఎఫ్ఎంఎఫ్ఎల్ (FMFL) కేటగిరీ కింద రూ.8,599గా ఛార్జీ పేర్కొన్నారు. ఈ అదనపు మొత్తం చెల్లించకపోతే రూమ్ బుకింగ్ రద్దు చేయబడుతుందని చెప్పినట్లు వేదాంత్ తెలిపాడు.

దీంతో అసంతృప్తికి గురైన అతను, హోటల్ నుంచి వచ్చిన ఈమెయిల్ స్క్రీన్ షాట్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసి తన నిరసన వ్యక్తం చేశాడు. ఇప్పటికే డబ్బు చెల్లించినందున, క్యాన్సిల్ చేస్తే డబ్బు తిరిగి రాని పరిస్థితిలో, ఇప్పుడు తప్పనిసరిగా అదనపు మొత్తం అడగడం న్యాయమేనా అని అతను ప్రశ్నించాడు. ఈ వ్యవహారం ఇంటర్నెట్‌లో పెద్ద చర్చకు దారితీసింది. కొందరు కస్టమర్‌కు మద్దతుగా నిలవగా, న్యూ ఇయర్ స్పెషల్ డిన్నర్ వంటి కార్యక్రమాలకు ప్రత్యేక ఛార్జీలు వసూలు చేయడం హోటళ్లలో సాధారణ ప్రక్రియేనని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *