హాంకాంగ్‌లోని సీయూహెచ్‌కే (CUHK) మెడికల్ సెంటర్‌లో 45 ఏళ్ల మహిళకు సెప్టెంబర్ 12న శస్త్రచికిత్స జరిగింది. గర్భాశయంలో సమస్య ఉందనే అనుమానంతో, కేవలం గర్భాశయం మరియు ఫెలోపియన్ ట్యూబ్స్ (గర్భనాళాలు) మాత్రమే తొలగించాలని వైద్యులు ప్రణాళిక వేశారు. ఆపరేషన్‌కు ముందు ఇచ్చిన సమ్మతి పత్రంలోనూ రెండు అండాశయాలను (ఓవరీస్) తొలగించకూడదని స్పష్టంగా పేర్కొన్నారు. కానీ, శస్త్రచికిత్స సమయంలో ఊహించని విధంగా రెండు అండాశయాలను కూడా తొలగించడంతో తీవ్ర షాక్‌కు గురయ్యారు.
ఆపరేషన్ తర్వాత తొలగించిన అవయవాలను పరిశీలిస్తుండగా, ప్రణాళికలో లేని రెండు అండాశయాలు కూడా అందులో ఉన్నట్లు ఓ నర్సు గుర్తించింది. వెంటనే ఈ విషయాన్ని వైద్యుడికి తెలియజేసింది. ఈ పొరపాటుపై వివరణ ఇచ్చిన డాక్టర్ ప్రొఫెసర్ చెంగ్ తక్-హాంగ్, శస్త్రచికిత్స కాస్త క్లిష్టంగా ఉందని, ఒక నిర్దిష్ట ప్రక్రియపై ఎక్కువ దృష్టి పెట్టడం వల్ల ముందుగా అనుకున్న విధానాన్ని మర్చిపోయానని తెలిపారు. జరిగిన తప్పుకు తానే పూర్తి బాధ్యత వహిస్తున్నట్లు ఒప్పుకున్నారు.
అనంతరం బాధిత మహిళను, ఆమె కుటుంబ సభ్యులను నేరుగా కలిసి వైద్యుడు క్షమాపణలు కోరారు. వారు ఆయన క్షమాపణను అంగీకరించారని, ఆ మహిళ తదుపరి చికిత్సను తానే స్వయంగా పర్యవేక్షిస్తానని వైద్యుడు తెలిపారు. రెండు అండాశయాలను తొలగించడం వల్ల శరీరంలో హార్మోన్ల స్థాయి అకస్మాత్తుగా పడిపోయి, మెనోపాజ్ (రుతువిరతి) లక్షణాలు ముందుగానే కనిపించే అవకాశం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం ఆ మహిళ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.
ఈ ఘటనపై ఆసుపత్రి యాజమాన్యం కూడా బాధిత మహిళకు, ఆమె కుటుంబానికి క్షమాపణలు తెలిపింది. శస్త్రచికిత్స సమయంలో వైద్యుడి ఏకాగ్రత తాత్కాలికంగా దెబ్బతినడమే ఈ పొరపాటుకు కారణమని విచారణలో తేలినట్లు ఆసుపత్రి పేర్కొంది. ఈ విషయాన్ని హాంకాంగ్ ఆరోగ్య శాఖకు కూడా తెలియజేశారు. భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు జరగకుండా శస్త్రచికిత్స విధానాల్లో అదనపు భద్రతా చర్యలు చేపడుతున్నట్లు ఆసుపత్రి తెలిపింది. అలాగే, సంబంధిత వైద్యుడిపై క్రమశిక్షణా చర్యలు తీసుకునే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నారు.

Leave a Reply