గర్భిణులు అప్రమత్తంగా ఉండాలి.. సాధారణ జలుబు, జ్వరం కూడా ప్రమాదకరంగా మారొచ్చు.! తల్లీబిడ్డలను సురక్షితంగా ఉంచుకోవడానికి ఈ విషయాలను మర్చిపోకండి.!!

గర్భధారణ సమయంలో మహిళలు తమ ఆరోగ్యం పట్ల అదనపు శ్రద్ధ వహించడం చాలా అవసరం. ముఖ్యంగా, వాతావరణం మారుతున్న ఈ నవంబర్ నెలలో ఉదయం, సాయంత్రం వేళల్లో చలి పెరగడంతో పాటు కొన్ని చోట్ల అడపాదడపా వర్షాలు కూడా కురుస్తున్నాయి.

దీనివల్ల జలుబు, ఫ్లూ, జ్వరం వంటి కాలానుగుణ అంటువ్యాధులు వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా, దోమల ద్వారా డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు కూడా వ్యాపించవచ్చు. గర్భధారణ సమయంలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉండటం వల్ల, ఇన్‌ఫెక్షన్లు సులభంగా సోకడమే కాకుండా, కొన్నిసార్లు తీవ్రమైన దుష్ప్రభావాలకు దారితీస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

గర్భిణులు ఇన్‌ఫెక్షన్ల బారిన పడకుండా ఉండాలంటే ముందుగా వ్యక్తిగత పరిశుభ్రతపై దృష్టి పెట్టాలి. భోజనం చేసే ముందు, బయటకు వెళ్లి వచ్చిన తర్వాత చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి. అవసరమైతే శానిటైజర్ వాడొచ్చు. రద్దీగా ఉండే ప్రదేశాలకు వెళ్లకపోవడం, జలుబు, జ్వరం ఉన్నవారికి దూరంగా ఉండటం ముఖ్యం. తీసుకునే ఆహారం పట్ల కూడా శ్రద్ధ వహించాలి. రోజూ 8 నుంచి 10 గ్లాసుల నీరు తాగుతూ శరీరంలో నీటి శాతం తగ్గకుండా చూసుకోవాలి. ఉసిరి, నిమ్మ, నారింజ వంటి విటమిన్-సి అధికంగా ఉండే ఆహార పదార్థాలతో పాటు ఆకుకూరలు, కూరగాయలు, డ్రై ఫ్రూట్స్ (నట్స్), గింజలను ఆహారంలో చేర్చుకోవాలి.

అలాగే, ఫ్లూ బారిన పడకుండా వైద్యుల సలహాతో ఫ్లూ వ్యాక్సిన్ వేయించుకోవచ్చు. గర్భధారణ సమయంలో ఏ నెలలోనైనా ఇన్‌ఫ్లుఎంజా వ్యాక్సిన్ వేయించుకోవచ్చని, ప్రతి సంవత్సరం ఈ వ్యాక్సిన్ తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. అదేవిధంగా, దోమకాటు నుంచి తప్పించుకోవడానికి దోమతెరలు వాడటం, ఇంటి చుట్టుపక్కల నీరు నిల్వ ఉండకుండా చూసుకోవడం వంటి ముందుస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. దోమల నివారణ క్రీములను (Mosquito repellent creams) వాడే ముందు వైద్యుడిని సంప్రదించడం మంచిది.

పండుగలు, వేడుకల పనుల హడావిడిలో గర్భిణులు తమ విశ్రాంతిని, నిద్రను అశ్రక్ష్యం చేయకూడదు. రాత్రిపూట 7 నుంచి 8 గంటలు నిద్రపోవడంతో పాటు పగటిపూట కూడా తగినంత విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సలహా ఇస్తున్నారు. ముఖ్యంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఛాతీ నొప్పి, ఛాతీ పట్టేసినట్లు ఉండటం, ఒంటిపై దద్దుర్లు, తీవ్రమైన జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. గర్భధారణ సమయంలో వచ్చే చిన్న చిన్న అనారోగ్య సమస్యలను సైతం నిర్లక్ష్యం చేయకుండా, తగిన జాగ్రత్తలు పాటించడం తల్లీబిడ్డల ఆరోగ్యానికి ఎంతో ముఖ్యం.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *