కేరళలోని కన్నూర్‌లో చిన్నారులకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఓ మదర్సా టీచర్, 11 ఏళ్ల బాలుడిపై రెండేళ్లపాటు వరుసగా లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.
నిందితుడిని మలప్పురం జిల్లాకు చెందిన మహమ్మద్ బషీర్‌గా గుర్తించారు. బాలుడికి 11 నుంచి 13 ఏళ్ల వయసు ఉన్న సమయంలో పలుమార్లు ఈ అకృత్యాలు జరిగినట్లు ఫిర్యాదు నమోదైంది.
ఇది ఏదో ఒకసారి జరిగిన ఘటన కాదని, చాలా కాలంగా కొనసాగుతూ వచ్చిందని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. జరిగిన విషయాన్ని ఎవరికీ చెప్పవద్దని ఆ టీచర్ బాలుడిని బెదిరించడంతో, భయంతో ఆ పిల్లాడు విషయాన్ని వెంటనే బయటకు చెప్పలేకపోయాడు. అనంతరం బాలుడు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా చోక్లి పోలీసులు దర్యాప్తు ప్రారంభించి, పోక్సో (POCSO) చట్టం కింద కేసు నమోదు చేశారు.
కేసు నమోదు కాగానే పోలీసులు నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. ప్రత్యేక పోలీసు బృందం, తిరూర్ పోలీసుల సహాయంతో మహమ్మద్ బషీర్‌ను అరెస్ట్ చేసింది. అనంతరం అతడిని పోక్సో కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. దాంతో నిందితుడిని కన్నూర్ సెంట్రల్ జైలుకు తరలించారు.
ఈ ఆరోపణలపై పోలీసులు లోతైన విచారణ కొనసాగిస్తున్నారు. పిల్లల భద్రత, సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన పరిస్థితుల్లో… నమ్మకంతో విద్య నేర్పించడానికి పంపే చోటే ఇలాంటి దారుణం జరగడం కలకలం రేపింది. ఈ కేసులో సమగ్ర విచారణ జరిపి పూర్తి నిజాలను వెలికితీస్తామని పోలీసులు తెలిపారు.

Leave a Reply