తమిళనాడు: కడలూరు జిల్లా చిదంబరం సమీపంలోని అన్నామలై నగర్ మీదికుడి సెంగమేట్టు వీధికి చెందిన కార్తీక్ భార్య కామాక్షి (28). వీరికి ఒక ఆడపిల్ల ఉంది. అయితే, గత ఏడాది కాలంగా భర్తతో వచ్చిన మనస్పర్థల కారణంగా కామాక్షి మీదికుడిలోని తన పుట్టింట్లోనే ఉంటోంది.
ఈ నేపథ్యంలో, నిన్న ఉదయం అదే ప్రాంతానికి చెందిన మహేంద్రన్ (65) అనే వృద్ధుడు కామాక్షి ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో ఇంటి ముందర ముగ్గు వేస్తున్న కామాక్షిపై ఇనుప పైపుతో తలపై బలంగా దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్ర రక్తస్రావమై ఆమె అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. కూతురిని కాపాడేందుకు వచ్చిన తండ్రి పాండురంగన్పై కూడా మహేంద్రన్ దాడి చేయడంతో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు.
రంగంలోకి ఎస్పీ.. విచారణలో షాకింగ్ నిజాలు
సమాచారం అందుకున్న అన్నామలై నగర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కామాక్షి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించారు. పరారైన మహేంద్రన్ను పోలీసులు వెంటనే అరెస్ట్ చేశారు. జిల్లా ఎస్పీ జయకుమార్ నిందితుడిని స్వయంగా విచారించారు.
ఎస్పీ జయకుమార్ తెలిపిన వివరాల ప్రకారం:
నిందితుడు మహేంద్రన్ వ్యవసాయంతో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. అలాగే వడ్డీలకు డబ్బులు ఇస్తుంటాడు. ఈ క్రమంలో అతను కామాక్షికి రూ.2 లక్షలకు పైగా నగదు, కొన్ని గ్రాముల బంగారు ఆభరణాలను ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే, కామాక్షితో తనకు వివాహేతర సంబంధం ఉందని, అందుకే ఆమెకు డబ్బులిచ్చి సహాయం చేస్తున్నానని మహేంద్రన్ ఊళ్లో ప్రచారం చేశాడు.
చెప్పుతో కొట్టి, వీడియో తీసిన యువతి
ఈ అబద్ధపు ప్రచారం కామాక్షికి తెలియడంతో ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మూడు నెలల క్రితం మహేంద్రన్ను కాట్టుమన్నార్కోవిల్కు రప్పించి, అతని సెల్‌ఫోన్ లాక్కుంది. “నన్ను ఉంచుకున్నానని అబద్ధాలు చెబుతావా?” అంటూ నిలదీస్తూ, అతడిని చెప్పుతో కొట్టి ఆ దృశ్యాలను వీడియో తీసింది. ఆ సమయంలో మహేంద్రన్ భయపడి.. “లేదు, నేను అబద్ధం చెప్పాను” అని ఒప్పుకున్నాడు. ఆ తర్వాత కామాక్షి అతని ఫోన్ ఇవ్వకుండా తనతో పాటే తీసుకువెళ్లిపోయింది.
పరువు పోయిందనే కక్షతోనే హత్య!
గత 15 రోజుల క్రితం మహేంద్రన్ గ్రామ పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టి తన సెల్‌ఫోన్‌ను కామాక్షి నుంచి తిరిగి తీసుకున్నాడు. అయితే, అప్పటికే కామాక్షి తనను చెప్పుతో కొట్టిన వీడియోను మహేంద్రన్ బంధువుల మొబైల్ ఫోన్లకు పంపించింది.
దీంతో సమాజంలో తనకు తీవ్ర అవమానం జరిగిందని, పరువు పోయిందని మహేంద్రన్ కక్ష పెంచుకున్నాడు. ఆ కోపంతోనే నిన్న ఉదయం కామాక్షి ఇంటికి వెళ్లి ఆమెను ఇనుప పైపుతో కొట్టి దారుణంగా హత్య చేశాడు. ప్రస్తుతం పోలీసులు నిందితుడిపై హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు.

Leave a Reply