ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ప్రయాగ్‌రాజ్ (అలహాబాద్) లో, వివాహమైన కేవలం నాలుగే రోజులకే సంతోష్ (28) అనే యువకుడు మర్మస్థితిలో మృతి చెందిన సంఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని, కలకలాన్ని రేపింది.
పన్పూర్వా గ్రామానికి చెందిన సంతోష్‌కు గత జూన్ 7వ తేదీనే ఎంతో వైభవంగా వివాహం జరిగింది. పెళ్లి ముగిసిన తర్వాత నవవధువుతో కలిసి ఎంతో సంతోషంగా ఇంటికి వచ్చిన సంతోష్ ఇంట్లో.. ఆ పెళ్లి వేడుకల సందడి ముగియకముందే ఈ ఘోర విషాదం చోటుచేసుకుంది.
గురువారం తెల్లవారుజామున గ్రామ శివార్లలోని గంగా నది తీరంలో ఉన్న ఒక చెట్టుకు సంతోష్ మృతదేహం ఉరివేసుకున్న స్థితిలో వేలాడుతూ కనిపించింది. దీనిని చూసిన గ్రామస్థులు తీవ్ర దిగ్భ్రాంతికి గురై, వెంటనే కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారం అందించారు. భర్త మరణవార్త విన్న నవవధువు.. చేతికి పెట్టుకున్న మెహందీ రంగు కూడా ఇంకా వెలిసిపోకముందే తన జీవితం ఇలా అయిపోయిందని గుండెలిసేలా రోదించింది. ఆ తల్లిదండ్రులు, బంధువుల ఆర్తనాదాలు ఆ గ్రామాన్నంతటినీ కన్నీరు పెట్టించాయి. సమాచారం అందుకున్న హండియా పోలీస్ స్టేషన్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
తమ్ముడు అదృశ్యం.. పాత కక్షలపై అనుమానాలు:
ప్రాథమికంగా ఇది ఆత్మహత్య కావచ్చునని పోలీసులు భావిస్తున్నప్పటికీ, ఈ మరణం వెనుక అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సంతోష్ మరణించినప్పటి నుండి అతని తమ్ముడు సుశీల్ హఠాత్తుగా కనిపించకుండా పోవడంతో, పోలీసులు అతని కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. మరోవైపు, తమకు పొరుగువారితో కొన్ని కుటుంబ గొడవలు ఉన్నాయని, వారిపైనే తమకు అనుమానం ఉందని సంతోష్ తల్లి తీవ్ర ఆరోపణలు చేస్తోంది. సరికొత్త జీవితాన్ని ప్రారంభించిన యువకుడు నాలుగే రోజులకే ఎందుకు ఈ ఘోర నిర్ణయం తీసుకున్నాడు? లేక దీని వెనుక ఏదైనా పక్కా ప్లాన్ ఉందా? అనే కోణంలో పోలీసులు అన్ని మార్గాల్లో తీవ్రంగా దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply