జీతం లేకుండానే వారానికి 16 గంటల అదనపు పని..! భారత ఉద్యోగుల షాకింగ్ పరిస్థితి.. ప్రపంచ దేశాల్లోనే అగ్రస్థానం.. వెలుగులోకి వచ్చిన సంచలన సమాచారం!

భారత్‌లో ఉద్యోగుల పని వేళలపై చర్చలు కొనసాగుతున్న నేపథ్యంలో, జీతం చెల్లించకుండా అదనపు పని చేయిస్తున్నారనే అంశంపై షాకింగ్ సమాచారం వెలుగులోకి వచ్చింది.

ఏడీపీ సంస్థ నిర్వహించిన ‘People at Work 2026’ సర్వే ప్రకారం.. భారత్‌లో 24 శాతం మంది ఉద్యోగులు వారానికి 16 గంటలు లేదా అంతకంటే ఎక్కువ సమయం జీతం లేకుండా అదనంగా పనిచేస్తున్నట్లు వెల్లడించారు. ఈ సర్వేలో పాల్గొన్న దేశాలతో పోలిస్తే ఈ శాతం భారత్‌లోనే అత్యధికంగా ఉన్నట్లు నివేదిక పేర్కొంది.

అంతేకాదు.. మరో 40 శాతం మంది భారత ఉద్యోగులు వారానికి 6 నుంచి 15 గంటల వరకు జీతం లేకుండా అదనపు పని చేస్తున్నట్లు సర్వేలో వెల్లడైంది. ఆఫీస్ సమయం ముగిసిన తర్వాత కూడా పనిని కొనసాగించడం, బ్రేక్ సమయంలోనూ పని చేయడం వంటి అంశాలు ఇందులో ఉన్నాయి.

దీంతో భారత్‌లో గణనీయమైన సంఖ్యలో ఉద్యోగులు తమ సాధారణ పని వేళలను దాటి పనిచేస్తున్నట్లు స్పష్టమవుతోంది.

ప్రపంచవ్యాప్తంగా చూస్తే.. 62 శాతం మంది ఉద్యోగులు వారానికి 5 గంటలలోపు మాత్రమే జీతం లేని అదనపు పని చేస్తున్నట్లు తెలిపారు. మరో 26 శాతం మంది 6 నుంచి 15 గంటలు, 12 శాతం మంది 16 గంటలు లేదా అంతకంటే ఎక్కువ అదనపు పని చేస్తున్నట్లు వెల్లడించారు.

దీంతో ప్రపంచ సగటుతో పోలిస్తే భారత్‌లో 16 గంటలు లేదా అంతకంటే ఎక్కువ జీతం లేని అదనపు పని చేస్తున్న ఉద్యోగుల శాతం దాదాపు రెండింతలు ఉండటం గమనార్హం.

అయితే ఎక్కువ గంటలు పనిచేయడం వల్ల ఉద్యోగుల పనితీరు పెరుగుతుందనే వాదనను కూడా ఈ సర్వే ప్రశ్నించింది. అదనపు పని గంటలు పెరిగే కొద్దీ ఉద్యోగుల్లో మానసిక ఒత్తిడి, పనితీరు పట్ల అసంతృప్తి, మరో ఉద్యోగం వెతకాలనే ఆలోచన ఎక్కువగా కనిపిస్తున్నట్లు నివేదిక తెలిపింది.

ముఖ్యంగా ఇంటి నుంచి పనిచేసే ఉద్యోగులు, యువ ఉద్యోగులు జీతం లేకుండా అదనపు పని గంటలను ఎక్కువగా ఎదుర్కొంటున్నట్లు సర్వే వెల్లడించింది.

ఈ గణాంకాలు ఉద్యోగుల పని-వ్యక్తిగత జీవితం మధ్య సమతుల్యత, పని గంటలు, అదనపు పనికి తగిన పారితోషికం వంటి అంశాలపై మరోసారి చర్చకు దారితీస్తున్నాయి.


Posted

in

by

Tags: