ఉత్తరప్రదేశ్‌లోని గోండా జిల్లాలో టీ పెట్టడానికి నిరాకరించిందనే కారణంతో తలెత్తిన గొడవలో భర్త తన భార్యను గొడ్డలితో నరికి చంపిన ఘటన తీవ్ర కలకలం రేపింది. 35 ఏళ్ల సుమన్ అనే మహిళ తన 12 ఏళ్ల కుమారుడి కళ్లెదుటే దారుణ హత్యకు గురైంది. ఘటన అనంతరం నిందితుడైన భర్త అక్కడి నుంచి పరారయ్యాడు.
శుక్రవారం రాత్రి సుమారు 11.30 గంటల సమయంలో మనోజ్ కుమార్ శుక్లా మద్యం సేవించి ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో భార్యను టీ పెట్టాలని అడిగాడు. సుమన్ అందుకు నిరాకరించడంతో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో ఆగ్రహానికి లోనైన మనోజ్, పక్కనే ఉన్న గొడ్డలితో భార్యపై దాడి చేసి హత్య చేశాడు. ఆ తర్వాత పిల్లలను ఇంట్లోనే ఒంటరిగా వదిలేసి అక్కడి నుంచి పారిపోయాడు.
తన కళ్లెదుటే తల్లిపై జరిగిన ఈ దారుణాన్ని చూసిన 12 ఏళ్ల కుమారుడు కిషన్, వెంటనే పోలీసులకు ఫోన్ చేసి తన తల్లిని చంపేశారంటూ సమాచారం అందించాడు. వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సుమన్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మృతురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మనోజ్, అతడి తల్లిపై పోలీసులు హత్య కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న మనోజ్‌ను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు.
జిల్లా కేంద్రానికి సుమారు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న కోటియా మదారా గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఫోరెన్సిక్ నిపుణులు, డాగ్ స్క్వాడ్ ఘటనాస్థలిని పరిశీలించి ఆధారాలు సేకరించారు. మనోజ్‌కు మద్యం అలవాటు ఉందని, తాగుడు మాన్పించడానికి భార్య ప్రయత్నించడంతో దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవని స్థానికులు తెలిపారు. ఈ దంపతులకు కిషన్ (12), షగున్ (4) అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు.

Leave a Reply