“డబ్బు కోసం భర్తనే చంపడానికి తెగించిన భార్య? రూ.6 కోట్ల ఆస్తి.. రూ.2 కోట్ల ఇన్సూరెన్స్! ఆహారంలో కలిపిన విషపదార్థం.. వైద్య పరీక్షల్లో బయటపడ్డ అసలు నిజం!”

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఘాజియాబాద్‌లో రూ.2 కోట్ల ఇన్సూరెన్స్ డబ్బు కోసం భర్త ఆహారంలో నిరంతరం విషపదార్థాన్ని కలిపి ఇచ్చిందన్న ఆరోపణలతో భార్యను పోలీసులు అరెస్ట్ చేశారు.

రేణు భట్నాగర్ అనే మహిళ తన భర్త సుశీల్ భట్నాగర్ ఆహారంలో సీసం (లెడ్) కలిపి ఇచ్చినట్లు ఆరోపణలు వచ్చాయి. సుశీల్‌కు సొంతంగా సుమారు రూ.6 కోట్ల విలువైన ట్రావెల్ ఏజెన్సీ ఉందని, అలాగే ఆయన పేరు మీద రూ.2 కోట్ల విలువైన జీవిత బీమా పాలసీ ఉందని సమాచారం.

గత కొన్ని నెలలుగా సుశీల్ ఆరోగ్యం నిరంతరం క్షీణిస్తూ వచ్చింది. దీంతో ఆసుపత్రిలో చేరిన ఆయనకు రక్త పరీక్షలు నిర్వహించగా, శరీరంలో సీసం మోతాదు సాధారణం కంటే చాలా ఎక్కువగా ఉన్నట్లు తేలింది. వరుసగా చేసిన పరీక్షల్లోనూ ఇదే నిర్ధారణ అయింది. ఆభరణాల తయారీ వ్యాపారంలో సీసాన్ని ఉపయోగిస్తుండటంతో, రేణు కుటుంబ సభ్యులకు ఆ వ్యాపారంతో సంబంధం ఉందని తెలుసుకున్న వైద్యులు అనుమానించి సుశీల్‌ను అప్రమత్తం చేసినట్లు సమాచారం.

దీంతో భార్యకు దూరంగా సుమారు నెల రోజుల పాటు ఒంటరిగా ఉన్న సుశీల్, తిరిగి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. అప్పుడు ఆయన రక్తంలో సీసం శాతం తగ్గినట్లు వెల్లడైంది. దీంతో అనుమానం మరింత బలపడటంతో భార్య, ఆమె కుటుంబ సభ్యులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా, తమ ఆహారంలో తల్లి ఏదో పదార్థాన్ని స్ప్రే చేయడం తాము చూశామని పిల్లలు చెప్పినట్లు కూడా సుశీల్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఈ కేసులో రేణును పోలీసులు విచారించగా, భర్తకు చెందిన రూ.6 కోట్ల విలువైన వ్యాపారం, రూ.2 కోట్ల ఇన్సూరెన్స్ డబ్బు గురించి ఆమె వెల్లడించినట్లు సమాచారం. భర్త ఆస్తులు, బీమా సొమ్మును కాజేయాలనే ఉద్దేశంతోనే ఈ పనికి పాల్పడినట్లు ఆమె అంగీకరించినట్లు తెలుస్తోంది. దీంతో రేణును పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనలో ప్రమేయం ఉన్నట్లు భావిస్తున్న ఇతరుల పాత్రపైనా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *