ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో ఓ రోడ్డు పక్కన ఉన్న రెస్టారెంట్లో ఇద్దరు యువతులు హల్చల్ చేసిన ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. తమ తండ్రిపై రెస్టారెంట్ సిబ్బంది దాడి చేసి అవమానించారనే ఆగ్రహంతో ఆ ఇద్దరు అక్కాచెల్లెళ్లు నేరుగా రెస్టారెంట్లోకి వెళ్లి వీరంగం సృష్టించారు. అక్కడి వస్తువులను ధ్వంసం చేయడంతో పాటు సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు బయటకు రావడంతో కలకలం రేగింది.
వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో నవంబర్ 4వ తేదీన ఓ రెస్టారెంట్ సిబ్బందికి, ఈ యువతుల తండ్రికి మధ్య గొడవ జరిగినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో రెస్టారెంట్ సిబ్బంది కలిసి తమ తండ్రిపై దాడి చేశారని యువతుల కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై భేలూపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని వారు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం.
దీంతో ఆగ్రహానికి గురైన ఇద్దరు అక్కాచెల్లెళ్లు స్వయంగా రంగంలోకి దిగారు. ద్విచక్ర వాహనంపై రెస్టారెంట్ వద్దకు చేరుకున్న వారు ముందుగా తమ మొబైల్ ఫోన్లలో అక్కడి పరిసరాలను వీడియో తీశారు. ఆ తర్వాత వారిలో ఒక యువతి ఒక్కసారిగా రెస్టారెంట్లోకి దూసుకెళ్లి అక్కడ ఉన్న పిండి పాత్రను కిందపడేసింది. అంతటితో ఆగకుండా ఓ సిబ్బందిపై నీళ్లు పోసి, వెంటనే రెస్టారెంట్ మూసివేయాలని గట్టిగా హెచ్చరించింది.
యువతుల ఆగ్రహాన్ని గమనించిన స్థానికులు వారిని శాంతింపజేసేందుకు ప్రయత్నించారు. అయితే అక్కడే ఉన్న ఓ మహిళ.. ‘ఇక్కడ పిల్లలు కూడా ఉన్నారు. కొంచెం బాధ్యతగా ప్రవర్తించండి. ఎందుకిలా గొడవ చేస్తున్నారు?’ అని ప్రశ్నించింది. దీంతో మరింత ఆగ్రహానికి గురైన యువతి ఆమెపై కూడా నోరు పారేసుకుంది. ‘నోరు మూసుకో’ అంటూ తీవ్రంగా స్పందించింది.
పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారుతుండటంతో స్థానికులు జోక్యం చేసుకుని గొడవను ఆపేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో వీడియో తీస్తున్న మరో యువతి అక్కడి ప్రజలకు క్షమాపణలు చెప్పిన దృశ్యాలు కూడా సీసీటీవీ వీడియోలో కనిపించాయి.
మరోవైపు, తమ మాట వినకుండా రెస్టారెంట్లోకి చొరబడి ఆస్తులను ధ్వంసం చేశారంటూ రెస్టారెంట్ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఇద్దరు అక్కాచెల్లెళ్లపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈ ఘటనపై స్పందించిన అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ గౌరవ్ కుమార్.. ఇరు వర్గాల ఫిర్యాదులు, సీసీటీవీ దృశ్యాల ఆధారంగా సమగ్ర విచారణ జరుపుతున్నట్లు వెల్లడించారు.
తండ్రిపై దాడి జరిగిందనే ఆవేదనతో న్యాయం కోసం నిలబడాలనుకున్న యువతులు.. చివరకు రెస్టారెంట్లోనే విధ్వంసానికి దిగడంతో ఈ ఘటన మరో వివాదానికి దారితీసింది. అసలు తప్పు ఎవరిది? ఈ వ్యవహారంలో పూర్తి నిజానిజాలు పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది.

Leave a Reply